ఇరాన్ హెచ్చరికలు.. ఇజ్రాయెల్‌కు అమెరికా ఆయుధాలు సరఫరా

ఠాగూర్

సోమవారం, 14 అక్టోబరు 2024 (13:14 IST)
అగ్రరాజ్యం తన సైనిక సిబ్బందిని ఇజ్రాయెల్ నుంచి దూరంగా ఉంచాలని ఇరాన్ హెచ్చరించింది. అయితే, అగ్రరాజ్యం మాత్రం ఈ బెదిరింపులను ఏమాత్రం ఖాతరు చేయలేదు. పైగా, అత్యాధునిక గగనతల రక్షణ వ్యవస్థను మోహరించనున్నట్లు అమెరికా ప్రకటించింది. ఓ పక్క ఇటీవలి ఇరాన్ క్షిపణి దాడులపై ఇజ్రాయెల్ ప్రతి దాడులకు సిద్ధమవుతుందనే వార్తలు పశ్చిమాసియాలో ఆందోళనలు కలిగిస్తున్నాయి. ఈ తరుణంలో అత్యాధునిక గగనతల రక్షణ వ్యవస్థను ఆపరేట్ చేసేందుకు బలగాలను ఇజ్రాయెల్‌కు పంపుతున్నట్లు అమెరికా పేర్కొనడం ఇరాన్ పాలకులకు మరింత ఆగ్రహం కలిగించింది. 
 
టెర్మినల్ హై ఆల్టిట్యూడ్ ఏరియా డిఫెన్స్ బ్యాటరీ (టీహెచ్ఐడీ)ని, సైనిక దళాలను ఇజ్రాయెల్‌కు పంపుతున్నట్లు పెంటగాన్ ఆదివారం ప్రకటించింది. టీహెచ్ఐడీ అనేది ఓ గగనతల రక్షణ వ్యవస్థ. శత్రువులు ప్రయోగించే బాలిస్టిక్ క్షిపణులను ఇది కూల్చేస్తుంది. అధ్యక్షుడు జో బైడెన్ ఆదేశాల మేరకు ఈ వ్యవస్థను మోహరించేందుకు రక్షణ శాఖ మంత్రి లాయిడ్ ఆస్టిన్ అనుమతి ఇచ్చారని ఒక ప్రకటనలో తెలిపింది. ఇజ్రాయెల్ గగనతల రక్షణను బలోపేతం చేసేందుకు ఇది సాయపడుతుందని తెలిపింది.
 
అమెరికాపై ఇరాన్ ఆరోపణలు చేసింది. ఇజ్రాయెల్‌‍కు అమెరికా రికార్డు స్థాయిలో ఆయుధాలను అందిస్తోందని ఇరాన్ ఆరోపించింది. ఇప్పుడు క్షిపణి నిరోధక వ్యవస్థను మోహరించి, దాన్ని నిర్వహించేందుకు బలగాలను పంపుతోందని, వారి ప్రాణాలను కూడా ప్రమాదంలో పడేస్తోందని ఇరాన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు