అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసిన కమలా హారిస్... ప్రస్తుత అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చేతిలో ఓడిపోయారు. ఈ ఓటమిపై ఆమె సంచలనం ఆరోపణలు చేశారు. 2024 అధ్యక్ష ఎన్నికల్లో ఆయన మళ్లీ పోటీ చేయాలని తీసుకున్న నిర్ణయం అత్యంత బాధ్యతారహితమైనదని, అది దేశ సేవ కన్నా ఆయన వ్యక్తిగత అహంకారం, ఆశయం వల్ల తీసుకున్న నిర్ణయమంటూ మండిపడ్డారు. తన ఆత్మకథ '107 డేస్'లో ఆమె వెల్లడించిన ఈ విషయాలు ఇప్పుడు అమెరికా రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఈ పుస్తకంలోని కొన్ని కీలక భాగాలను 'ది అట్లాంటిక్' పత్రిక ప్రచురించింది.
ఒకప్పుడు బైడెన్‌కు అత్యంత విధేయురాలిగా పేరుగడించిన కమలా హారిస్ ఇప్పుడు ఆయనపై ఇంత తీవ్ర స్థాయిలో విమర్శలు చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. "అది జో, జిల్ దంపతుల నిర్ణయం అని మేమంతా ఒక మంత్రంలా పఠించాం. మేమంతా హిప్నటైజ్ అయినట్టుగా ప్రవర్తించాం. వెనక్కి తిరిగి చూసుకుంటే అది ఆయన చేసిన అతి పెద్ద అవివేకమనిపిస్తోంది" అని కమలా హారిస్ తన పుస్తకంలో పేర్కొన్నారు. దేశ భవిష్యత్తు ప్రమాదంలో ఉన్నప్పుడు, ఒక వ్యక్తి అహంకారానికి, ఆశయానికి అంత ప్రాధాన్యం ఇవ్వాల్సింది కాదని ఆమె అభిప్రాయపడ్డారు.
తాను ఉపాధ్యక్షురాలిగా ఉన్నందున పోటీ నుంచి తప్పుకోమని బైడెన్‌కు సలహా ఇవ్వలేని క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నానని కమల చెప్పుకొచ్చారు. "ఒకవేళ నేను ఆ సలహా ఇచ్చి ఉంటే అది నా స్వార్థం కోసమే అని, అధికార దాహంతోనే అలా చెప్పానని ఆయన భావించేవారు. నా సలహాను ఒక విషపూరితమైన నమ్మకద్రోహంగా చూసే ప్రమాదం ఉంది" అని ఆమె రాశారు. అందుకే బైడెన్ నిర్ణయాలకు తాను అడ్డు చెప్పలేకపోయానని పేర్కొన్నారు.