భారత ప్రభుత్వం అనుమతిలేకుండా పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో చైనా బస్సు సర్వీసులను ప్రారంభించింది. ఈ సర్వీసులు చైనా నుంచి పాకిస్థాన్‌ల మధ్య నడుస్తాయి. ఈ సర్వీసులు ఇటీవల ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో కరాచీలోని చైనా రాయబార కార్యాలయంపై పాకిస్థాన్‌లోని బలూచ్ లిబరేషన్ ఆర్మీకి చెందిన ఉగ్రవాదులు దాడికి తెగబడ్డారు. శుక్రవారం ఉదయం ఈ కాల్పులకు తెగబడగా ముగ్గురు ఉగ్రవాదులను పాక్ భద్రతా బలగాలు కాల్చి చంపాయి. అలాగే, ఇద్దరు పోలీసులతో పాటు నలుగురు ప్రాణాలు కోల్పోయారు. చైనాకు చెందిన ఓ భద్రతాధికారి గాయపడ్డారు.
అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే ప్రాంతంలోని చైనా రాయబార కార్యాలయంపై ఉగ్రవాదులు దాడికి పాల్పడటం ఇటు పాకిస్థాన్‌లోనూ అటు చైనాలోనూ కలకలం సృష్టించింది. ఈ దాడికి పాల్పడింది తామేనని, పశ్చిమ పాకిస్థాన్‌లో చైనా పెట్టుబడి ప్రాజెక్టులను వ్యతిరేకిస్తున్నామని అందుకే ఈ దాడులకు పాల్పడినట్లుగా మిలిటెంట్లు అధికారికంగా ప్రకటించారు.
ఇటీవల పాకిస్థాన్ టు చైనాల మధ్య ఓ బస్సు సర్వీసు ప్రారంభమైంది. ఈ బస్సు పాక్ ఆక్రమిత కాశ్మీర్ మీదుగా రాకపోకలు సాగిస్తుంది. ఇండో-పాక్ దేశాల మధ్య ఉన్న నిబంధనలకు ఇది పూర్తి విరుద్ధం. కానీ, పాక్ - చైనా దేశాల మధ్య ఉన్న సత్‌సంబంధాల కారణంగా భారత్‌ను విస్మరించి బస్సు సర్వీసు ప్రారంభించారు. ఈ నేపథ్యంలో కరాచీలోని చైనా రాయబార కార్యాలయంపై ఉగ్రవాదులు దాడులకు తెగబడటం గమనార్హం.