దేశద్రోహం నేరం కింద ముషారఫ్‌కు పెషావర్ ప్రత్యేక కోర్టు మరణశిక్ష విధిస్తూ ఇటీవల తీర్పునిచ్చిన విషయం తెల్సిందే. ఈ తీర్పును సవాల్ చేస్తూ ఆయన తరపున న్యాయవాదులు పిటిషన్లు దాఖలు చేశారు. ముషారఫ్ తరపు న్యాయవాది అజార్ సిద్దిఖి లాహోర్ హైకోర్టులో 86 పేజీల పిటిషన్‌ను దాఖలు చేశారు. ఇందులో ప్రభుత్వాన్ని, ఇతరులను ప్రతిపవాదులుగా చేర్చారు.
తీర్పు క్రమరాహిత్యంగా, విరుద్ధ ప్రకటనల మిశ్రమంగా ఉన్నదని, విచారణను వేగంగా, తొందరపాటుతో జరిపారని పేర్కొన్నారు. జాతీయ ప్రయోజనాలకు హాని కలిగించే ఎటువంటి చర్యలను ముషారఫ్ తీసుకోలేదని అందులో వెల్లడించారు. న్యాయస్థానానికి సమర్పించిన సాక్ష్యాల్లో సైతం అతనిపై రాజద్రోహం నేరం లేదని పేర్కొన్నారు. జస్టిస్ మజాహిల్ అలీఅక్బర్ నఖ్వి నేతృత్వంలోని ధర్మాసనం జనవరి 9న ఈ పిటిషన్‌పై వాదనలను విననున్నది.