ప్రముఖ పర్యాటక దేశంగా గుర్తింపు పొందిన మాల్దీవుల అధ్యక్షుడు ముహమ్మద్‌ను హతమార్చేందుకు క్షుద్ర పూజలు చేసినట్టు ఆరోపణలు వచ్చాయి. వీటిని ఆయన మంత్రివర్గంలోనే సహచరులే చేపించినట్టు సమాచారం. దీంతో మంత్రివర్గంలోని ఇద్దరు మంత్రులను మాల్దీవుల పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే పోలీసులు ఇద్దరు మంత్రులను అరెస్టు చేశారని స్థానిక మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.
అరెస్టు అయిన మంత్రుల్లో పర్యావరణ సహాయమంత్రిగా విధులు నిర్వహిస్తున్న షమ్నాజ్ సలీం, అధ్యక్షుడి కార్యాలయ మంత్రిగా ఉన్న ఆమె మాజీ భర్త రమీజ్‌లతో పాటు మరో అరెస్టు చేశారట. అయితే, పోలీసులు మాత్రం ఈ విషయంలో ఎటువంటి ప్రకటన విడుదల చేయలేదు. “షమ్నాజ్‌తో పాటు మరో ఇద్దరినీ ఆదివారం ఆరెస్టు చేయగా, ఈ ముగ్గురికీ ఏడు రోజుల కస్టడీ రిమాండు విధించారు. బుధవారం ఆమెను పర్యావరణ శాఖ మంత్రి పదవి నుంచి తొలగించారు. అలాగే రమీజ్ను గురువారం మంత్రి పదవి నుంచి తప్పించారు' అని ఓ వార్తా వెబ్‌సైట్ పేర్కొంది.