పర్వేజ్ ముషారఫ్‌కు మరణానంతరం మరణ శిక్ష

సెల్వి

గురువారం, 11 జనవరి 2024 (16:12 IST)
పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్‌కు మరణానికి తర్వాత మరణ శిక్ష విధించబడింది. ప్రత్యేక న్యాయస్థానం విధించిన శిక్షను బుధవారం సుప్రీం సమర్థించింది. సుదీర్ఘ కాలంపాటు అనారోగ్యంతో బాధపడిన ముషారఫ్ కోర్టు అనుమతితో చికిత్స కోసం లండన్ వెళ్లారు. అక్కడి నుంచి దుబాయ్ వెళ్లి గతేడాది ఫిబ్రవరి 5న కన్నుమూశారు. 
 
సైనిక తిరుగుబాటు ద్వారా 1999లో అధికారం చేజిక్కించుకున్న జనరల్ పర్వేజ్ ముషారఫ్.. దాదాపు పదేళ్ల పాటు దేశాన్ని పాలించారు. ఈ కాలంలో రెండుసార్లు అత్యవసర పరిస్థితి విధించి రాజ్యాంగాన్ని రద్దు చేశారు. ఈ కేసుపై ఆయన విచారణ ఎదుర్కొన్నారు. దుబాయ్ నుంచే దీనిపై న్యాయ పోరాటం చేశారు. ఈ తీర్పును లాహోర్ హైకోర్టులో సవాల్ చేశారు. 
 
లాహోర్ కోర్టు ఆయనకు అనుకూలంగా తీర్పు వెలువరించగా.. పిటిషన్ దారులు, ప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్పీల్ చేశారు. స్పెషల్ కోర్టు తీర్పుపై విచారణ జరుగుతుండగానే గతేడాది ఫిబ్రవరి 5న ఆయన దుబాయ్‌లో కన్నుమూశారు.
 
ముషారఫ్‌కు విధించిన మరణ శిక్షను సమర్థించడం తప్ప తమకు ప్రత్యామ్నాయం లేకుండా పోయిందని.. మరణానంతరం ఆయనకు మరణ శిక్షను ఖరారు చేసినట్లు కోర్టు పేర్కొంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు