స్విమ్మింగ్ పూల్‌లో సేద తీరుతున్న జంట, భూకంపం ధాటికి ప్రాణభయంతో పరుగు (video)

ఐవీఆర్

శనివారం, 29 మార్చి 2025 (16:50 IST)
మయన్మార్‌లో సంభవించిన భారీ భూకంపం ఆ దేశ ప్రజలను వణికించింది. ఓ బహుళ అంతస్తుల హోటల్లో ఓ జంట స్విమ్మింగ్ పూల్ లో హాయిగా సేద తీరుతున్నారు. ఆ సమయంలో ఒక్కసారిగా స్విమ్మింగ్ పూల్ నీళ్లలో అలజడి మొదలైంది. అవి కాస్తా పెద్దపెద్ద తెప్పలుగా మారడంతో ఏదో ఉపద్రవం సంభవిస్తుందని గమనించిన జంట ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు తీసారు. కాగా మయన్మార్ భూకంపం ధాటికి ఇప్పటివరకూ మరణించిన వారి సంఖ్య 1,000 దాటిందనీ, కనీసం 2వేల మందికి పైగా గాయపడ్డారని అక్కడి అధికారులు వెల్లడించారు.
 
శుక్రవారం మధ్యాహ్నం ఒకటిన్నర సమయంలో మయన్మార్‌లోని సాగింగ్ నగరానికి వాయువ్యంగా 7.7 తీవ్రతతో సంభవించిన భూకంపం దేశంలోని పలు ప్రాంతాలలో భారీ విధ్వంసం సృష్టించింది. మధ్య మయన్మార్‌లోని మండలేలోని ఒక అపార్ట్‌మెంట్ బ్లాక్ శిథిలాల లోపల 90 మందికి పైగా చిక్కుకుపోయి వుండవచ్చని అంటున్నారు. బాధితులను విడిపించడానికి సహాయక బృందాలు తీవ్రంగా కృషి చేస్తున్నట్లు రెడ్‌క్రాస్ అధికారి తెలిపారు.
 
శుక్రవారం 7.7 తీవ్రతతో సంభవించిన భూకంపంలో తీవ్రంగా దెబ్బతిన్న మాండలేలోని భవనాల్లో స్కై విల్లా కండోమినియం ఒకటి, దాని 12 అంతస్తులలో చాలా వరకు ఒకదానిపై ఒకటి కుప్పకూలిపోయాయి. ఈ భవనంలో ఎంతమంది చిక్కుకుని వున్నారోనన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు