రెండు షాట్లకే బిన్ లాడెన్ బుర్ర ముక్కలయింది: సీల్ కమాండో ఓనీల్ కథనం

సోమవారం, 10 ఏప్రియల్ 2017 (08:03 IST)
అల్‌కాయిదా చీఫ్‌ ఒసామా బిన్‌ లాడెన్‌‌ను సీల్ ఆపరేషన్‌లో చంపింది తానేనని బహిరంగంగా ప్రకటించుకున్న అమెరికన్ సీల్ టీమ్ 6 షూటర్ రాబర్ట్ ఓ నీల్ మరొక సంచలన ప్రకటన చేశాడు. 2011లో పాకిస్తాన్ లోని అబోత్తాబాద్ రహస్య స్థావరంలో దాగిన బిన్ లాడెన్‌ను కాల్చినప్పుడు అతడి తల పూర్తిగా చిద్రమైపోయిందని, దీంతో మృతదేహాన్ని గుర్తించేందుకు కూడా కష్టమైపోయిందని చీలిపోయిన అతడి తల భాగాలను ఓ దగ్గరకు చేర్చాల్సి వచ్చిందని ఓనీల్ చెప్పాడు.
 
పాకిస్తాన్‌ అబోటాబాద్‌లోని లాడెన్‌ స్థావరంపై జరిపిన దాడిని వివరిస్తూ ‘ద ఆపరేటర్ ఫైరింగ్ ది షాట్స్ దట్ కిల్డ్ బిన్ లాడెన్ ‌’ పేరుతో  రాసిన పుస్తకంలో రాబర్ట్‌ ఓనీల్‌ ఈమేరకు వెల్లడించాడు. లాడెన్‌ తలలోకి తాను మొత్తం మూడు బుల్లెట్లు దించినట్లు వివరించాడు. 2001 సెప్టెంబర్‍‌లో అమెరికాలో మారణహోమం సృష్టించిన అల్ ఖాయిదా చీఫ్ వధ వార్త ప్రపంచానికే షాక్ తెప్పించింది. 
 
అల్‌కాయిదా చీఫ్‌ ఒసామా బిన్‌ లాడెన్‌ తల తాను కాల్చిన తుపాకీ గుళ్లకు ఛిద్రమైపోయిందని, మృతదేహాన్ని గుర్తించేందుకు ఆ ముక్కలను ఓ దగ్గరకు చేర్చాల్సి వచ్చిందని అమెరికన్‌ మాజీ నేవీ సీల్‌ షూటర్‌ రాబర్ట్‌ ఓనీల్‌ పేర్కొన్నాడు.
 
2011 మే 2న పాకిస్తాన్ అబోత్తాబాద్‌‌లో బిన్ లాడెన్ స్థావరంపై జరిగిన దాడి గురించి ఓ నీల్ చెప్పిన కథనంపై ఇప్పటికీ వివాదాలు చెలరేగుతూనే ఉన్నాయి. స్పెషల్ ఆపరేషన్స్ జరిపినప్పుడు వాటి గురించి నరమానవుడికి కూడా చెప్పకుడదన్న నిబంధనను ధిక్కరించి ఓనీల్ తానే బిన్ లాడెన్‌ను కాల్చి చంపానని చెప్పుకున్నాడు. 
 
తాజా కథనంలో లాడెన్ స్థావరంలో అతడు దాగి ఉన్న కాంపౌండ్ రెండో ఫ్లోర్‌లోకి తనతోపాటు ఆరుగురు సీల్ కమాండోలు ప్రవేశించినప్పుడు లాడెన్ కుమారుడు ఖాలిద్ ఎకే-47తో దాక్కుని ఉన్నాడని, తాము అతడిని అరబిక్ భాషలో ఖాలిద్ ఇక్కడికి రా అని పిలవగానే ఏమిటి అంటూ అతడు బయటకు వచ్చాడని రాగానే అతడి ముఖానికేసి కాల్పులు జరిపామని ఓ నీల్ చెప్పాడు. 
 
అక్కడే పరుపు సమీపంలో ఒక మహిళను ముందుంచుకుని ఆమె భుజాలపై చేయి వేసి బిన్ లాడెన్ నిల్చున్నాడని, అతడిని చూడగానే క్షణకాలంలో ఆ మహిళ కుడి భుజం వైపు రెండు సార్లు కాల్పులు జరపగా బిన్ లాడెన్ కుప్పకూలిపోయాడని ఓనీల్ చెప్పాడు. ఆ రెండు బుల్లెట్లతోనే లాడెన్ తల ముక్కలైపోయిందని, తర్వాత అతడి మరణాన్ని ధ్రువపర్చుకునేందుకు మరో బుల్లెట్‌ని పేల్చానని నీల్ తెలిపాడు. 
 
తోటి సీల్ కమాండో మార్క్ బిస్సోన్నెట్టె లాడెన్ స్థావరంపై దాడి ఘటనలో తన వెర్షన్‌ చెబుతూ నో ఈజీ డే అనే పుస్తకం రాసిన అయిదేళ్ల తర్వాత ఓనీల్ ‘ద ఆపరేటర్ ఫైరింగ్ ది షాట్స్ దట్ కిల్డ్ బిన్ లాడెన్ ’ అనే పుస్తకంలో తన వెర్షన్ గురించి రాయడం విశేషం
 

వెబ్దునియా పై చదవండి