పాకిస్థాన్‌కు భారత ఆర్మీ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. ఈ మేరకు భారత్, పాకిస్థాన్‌కు చెందిన మిలిటరీ ఆపరేషన్స్ డైరెక్టర్ జనరళ్లు హాట్‌లైనులో మాట్లాడుకున్నారు. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ పాక్ సైన్యం కాల్పులు పాల్పడుతున్న విషయాన్ని ప్రధానంగా ప్రస్తావించిన భారత్.. పాకిస్థాన్ డైరెక్టర్ జనరల్స్‌కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినట్టు రక్షణ శాఖ వర్గాలు వెల్లడించాయి.
పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ - పాకిస్థాన్‌ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెల్సిందే. దీంతో సరిహద్దు ప్రజలు అప్రమత్తమయ్యారు. అదేసమయంలో పాకిస్థాన్ కూడా భద్రతా పరంగా పలు చర్యలు తీసుకుంటోంది. తాజాగా పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని గిల్గిత్, స్కర్డు తదితర ప్రాంతాలకు విమాన సర్వీసులను పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ రద్దు చేసింది.
సరిహద్దుల్లో ఉద్రిక్తతలు నెలకొన్న వేళ పాకిస్థాన్ కూడా గగనతల నిఘాను ముమ్మరం చేసింది. ఈ క్రమంలోనే లాహోర్, కరాచీ నుంచి పీవోకేలోని స్కర్దు, గిల్గిత్ ప్రాంతాలకు నడిచే విమాన సర్వీసులన్నీ నిలిపివేసినట్టు స్థానిక మీడియా వెల్లడించింది. జాతీయ భద్రతను దృష్టిలో ఉంచుకుని ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధికారులు వెల్లడించారు. వీటితో పాటు స్థానికంగా ఉన్న విమానాశ్రయాలకు హైఅలెర్ట్ ప్రకటించినట్టు సమాచారం.