పాకిస్థాన్ దేశంలో ఆర్థిక సంక్షోభం తారా స్థాయికి చేరింది. ఇప్పటికే ఆహార సంక్షోభంతో పాక్ ప్రజలు కొట్టుమిట్టాడుతున్నారు. తాజాగా ఆర్థిక సంక్షోభం కూడా తలెత్తింది. దీంతో పీకల్లోతు ఆర్థిక కష్టాల్లో కూరుకునిపోయింది. ఈ గండం నుంచి గట్టెక్కేందుకు పాకిస్థాన్ పాలకులు కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇందులోభాగంగా, తాజాగా లీటరు పెట్రోల్‌పై ఏకంగా 35 రూపాయల ధరను (భారత కరెన్సీలో రూ.11.80 పైసలు) పెంచేశారు. ఫలితంగా ప్రస్తుతం పాక్‌లో లీటరు పెట్రోల్ ధర రూ.249.80 పైసలకు చేరింది.
ఇదే అంశంపై పాకిస్థాన్ ఆర్థిక శాఖామంత్రి ఇషాక్ ధార్ ఓ ప్రకటన చేశారు. "పెట్రోల్ డీజిల్‌పై లీటరుకు రూ.35 చొప్పున పెంచాలని నిర్ణయించాం. కిరోసిన్, లైట్ డీజిల్ ధరలను లీటరుకు రూ.18 చొప్పున పెంచుతున్నాం" అని పేర్కొన్నారు. ఈ పెంచిన ధరలు కూడా ఆదివారం ఉదయం 11 గంటల నుంచే అమల్లోకి వచ్చాయి.
తాజాగా పెంచిన ధరతో కలుపుకుంటే లీటరు పెట్రోల్ ధర రూ.249.80, హైస్పీడ్ పెట్రోల్ లీటరు ధర రూ.262.80, కిరోసిన్ ధర రూ.189.83, లైట్ డీజల్ ధర రూ.187కు చేరింది. పెరుగుతున్న ద్రవ్యోల్బణం, డాలరు విలువతో పోలిస్తే పాకిస్థాన్ రూపాయి విలువ తీవ్రస్థాయిలో పతనమైపోతోంది. దీంతో పెట్రోల్ ధరలను పెంచుతున్నట్టు ప్రకటించారు.