భారత్‌పై దాడులు జరిపేందుకు ఎఫ్-16 యుద్ధవిమానాలను ఉపయోగించారా?

బుధవారం, 6 మార్చి 2019 (16:30 IST)
భారత్ పాక్ మధ్య గతవారం జరిగిన గగనతల దాడుల్లో పాకిస్థాన్ ఎఫ్-16 యుద్ధ విమానాలను దుర్వినియోగం చేసిందనే అంశాన్ని నిశితంగా పరిశీలిస్తున్నట్లు అమెరికాకు చెందిన అధికార ప్రతినిధి రాబర్ట్ పలాడినో తెలిపారు. ఈ మేరకు భారత్ ఇప్పటికే తగిన ఆధారాలను అమెరికా ముందు ఉంచింది. ఎఫ్-16 ద్వారా మాత్రమే ప్రయోగించగలిగే అమ్రామ్ క్షిపణి శకలాలు లభించినట్లు భారత వాయుసేన ఇదివరకే ప్రకటించింది. అందుకు సంబంధించిన ఆధారాలను మీడియా ముందు కూడా ఉంచింది. కాగా తాము ఎఫ్-16 జెట్‌లను వినియోగించలేదని పాక్ వాదిస్తోంది.
 
ఎఫ్‌-16 దుర్వినియోగం గురించి మరింత సమాచారాన్ని తెప్పించుకుంటున్నామని అమెరికా అధికార వర్గాలు తెలిపాయి. భద్రతా, ద్వైపాక్షిక నిబంధనల దృష్ట్యా ఈ విషయంలో మరిన్ని విషయాలను బయటికి వెల్లడించలేమని పలాడినో వ్యాఖ్యానించారు. అయితే భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో జరిగిన దాడుల్లో భారత్ మిగ్-21 విమానాలను వినియోగించగా.. పాక్ మాత్రం అమెరికా నుండి కొనుగోలు చేసిన ఎఫ్-16 యుద్ధ విమానాన్ని వాడినట్లు భారత వాయుసేన ప్రకటించింది. 
 
గతంలో పాక్ ఎఫ్-16ను అమెరికా నుండి కొనుగోలు చేసే సమయంలో వాటిని స్వీయ రక్షణ కోసం మాత్రమే ఉపయోగిస్తామని ఒప్పందం కుదుర్చుకుంది. నిబంధనలకు విరుద్ధంగా వాటిని దాడుల కోసం ఉపయోగించినట్లు తేటతెల్లమవుతోంది. మరోవైపు అమెరికా అధ్యక్షుడు పాక్‌కి గట్టి షాక్ ఇచ్చారు. 
 
పాకిస్థాన్ నుండి అమెరికాలో ఉన్న వారి యొక్క వీసా గడువును 5 సంవత్సరాల నుండి 1 సంవత్సరానికి కుదించాలని నిర్ణయం తీసుకున్నాడు. ఇలా పాక్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాల నుండి అన్ని విధాలుగా సంబంధాలను బలహీనం చేసుకుంటోంది. ఇకనైనా తీవ్రవాద కార్యకలాపాల అడ్డాలను తరిమికొట్టి ప్రపంచ శాంతి పాక్ ప్రయత్నిస్తుందేమో చూడాలి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు