పీవోకే ప్రజలకు హెచ్చరికలు.. 2 నెలలు పాటు ఆహారాన్ని నిల్వ చేసుకోవాలంటూ..

ఠాగూర్

శుక్రవారం, 2 మే 2025 (17:48 IST)
పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పీవోకే)లోని ప్రజలకు పాకిస్థాన్ సైన్యంతో పాటు స్థానిక అధికార యంత్రాంగం ఓ హెచ్చరిక జారీచేసింది. వచ్చే రెండు నెలలకు సరిపడ ఆహారాన్ని దాచుకోవాలని సూచించింది. పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ పాకిస్థాన్ దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. దీంతో ఈ రెండు దేశాల మధ్య ఏ క్షణమైనా యుద్ధం ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. మరోవైపు ఉగ్రవాదులకు అడ్డాగా ఉన్న పాక్ ఆక్రమిత కాశ్మీర్‌ను పూర్తిగా స్వాధీనం చేసుకోవాలనే డిమాండ్లు భారతదేశ వ్యాప్తంగా వినిపిస్తున్నాయి. ఇలాంటి తరుణంలో ఆహారం నిల్వ చేసుకోవాలంటూ స్థానికులకు పీవోకే యంత్రాంగంతో పాటు పాక్ సైనికులు అప్రమత్తం చేశారు. 
 
రెండు నెలలకు సరిపడా ఆహారాన్ని నిల్వ చేసుకోవాలని వాస్తవాధీన రేఖకు సమీపంలోని ఉన్న 13 నియోజకవర్గాల ప్రజలకు సూచనలు చేశాం అని చౌద్రీ అన్వర్ ఉల్‌హక్ స్థానిక అసెంబ్లీలో శుక్రవారం వెల్లడించారు. అలాగే, స్థానిక ప్రభుత్వం రూ.100 కోట్లతో ఎమర్జెన్సీ ఫండ్‌ను ఏర్పాటు చేసింది. ఆహారం, ఔషదాలు, ఇతర కనీస అవసరాల సరఫరాకు ఎలాంటి అంతరాయం లేకుండా చూసుకునేందుకు ఈ మొత్తాన్ని కేటాయించినట్టు ఉల్‌హక్ తెలిపారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు