అంగారా ఎయిర్‌లైన్‌కు చెందిన ఏఎన్-24 రకం విమానం గురువారం ఉదయం బ్లాగోవెష్ చెన్స్క్ నుంచి చైనా సరిహద్దుల్లో ఉన్న టిండా ప్రాంతానికి బయలుదేరింది. ఇది మరికొద్దిసేపట్లో ల్యాండ్ కావాల్సివుండగా, ఉన్నట్టుండి ట్రాఫిక్ కంట్రోల్స్‌తో సంబంధాలు తెగిపోయాయి. దీంతో అప్రమత్తమైన అధికారులు ఎమర్జెన్సీ సర్వీసెస్‌ను సిద్ధం చేసి విమానం కోసం గాలించగా, గమ్యస్థానానికి కేవలం 15 కిలోమీటర్ల దూరంలో అది కూలిపోయినట్టు గుర్తించారు.
ప్రమాదం జరిగిన ప్రాంతంలో మంటలు ఎగిసిపడుతున్నాయి. రెస్క్యూ సిబ్బంది అక్కడికి చేరుకునేందుకు యత్నిస్తున్నారు. ఈ విమానం తొలుత ల్యాండింగ్‌కు యత్నించగా రాడార్ నుంచి గల్లంతై కూలినట్టు తెలుస్తోంది. ప్రమాద సమయంలో విమానంలో 43 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది ఉన్నారు. ప్రయాణికుల్లో ఐదుగురు చిన్నారులు కూడా ఉన్నట్టు రష్యాన్ మీడియా కథనాలు వెల్లడించాయి. ప్రాథమిక సమాచారం మేరకు ఇప్పటివరకు 49 మంది చనిపోయారు.