హ్యారీ పోటర్ కోట ధ్వంసం.. ఎందుకని?

ఠాగూర్

బుధవారం, 1 మే 2024 (11:00 IST)
ఉక్రెయిన్‌లోని అత్యంత సుందర భవనాల్లో ఒక దానిని రష్యా తన క్షిపణి దాడిలో ధ్వంసం చేసింది. నల్ల సముద్ర తీరానున్న ఒడెస్సా నగరంలో హ్యారీపోటర్‌ కోటగా ప్రసిద్ధి చెందిన ఓ విద్యా సంస్థ భవనంపై క్షిపణితో దాడి చేసింది. ఇందుకోసం ఇసికందర్‌ క్షిపణిపై క్లస్టర్‌ వార్‌హెడ్‌ను అమర్చి మాస్కో ప్రయోగించినట్లు అనుమానిస్తున్నారు. 
 
ఈ ఘటనలో ఐదుగురు చనిపోగా.. మరో 30 మంది గాయపడినట్లు ఉక్రెయిన్‌ అధికారులు ప్రకటించారు. ఈ క్షిపణి పడిన చోటు నుంచి 1.5 కిలోమీటర్ల వరకు శకలాలు పడినట్టు ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. 20 భవనాల వరకు దెబ్బతిన్నాయి. ఈ దాడికి సంబంధించిన చిత్రాలను ఉక్రెయిన్‌ ప్రాసిక్యూటర్‌ జనరల్‌ విడుదల చేశారు. దీనిలో ఓ సుందర భవనం అగ్నికీలల్లో దహనమవుతున్న దృశ్యాలున్నాయి. 
 
మరోవైపు క్రిమియాలోని తమ ఎయిర్‌ డిఫెన్స్‌ వ్యవస్థ కొన్ని క్షిపణులు, డ్రోన్లను గాల్లోనే ధ్వంసం చేసిందని రష్యా పేర్కొంది. ఈ దాడిలో అమెరికా సరఫరా చేసిన ఆర్మీ టాక్టికల్‌ మిసైల్‌ సిస్టమ్‌కు చెందిన ఆయుధాలున్నట్లు వెల్లడించింది. వీటితోపాటు 10 డ్రోన్లు కూడా ఉన్నాయన్నారు. ఖర్కీవ్‌ నగరంలోని ఓ రైల్వే లైన్‌పై రష్యా గైడెడ్‌ బాంబ్‌తో దాడి చేసింది. ఈ ఘటనలో ఒకరు ప్రాణాలు కోల్పోగా.. పలువురు గాయపడ్డారు. ఇది ఉక్రెయిన్‌లో రెండో అతిపెద్ద నగరం కావడం గమనార్హం. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు