చైనా బుద్ధిని మార్చుకోవట్లేదు. అఫ్ఘాన్‌లో తాలిబన్ల రాక్షసకాండను ప్రపంచమంతా వ్యతిరేకిస్తుంటే… డ్రాగన్ మాత్రం శభాష్ అంటోంది. తాలిబన్లకు స్నేహ హస్తం అందించి దోస్త్ మేరా దోస్త్ అంటూ హత్తుకుంటోంది. అటు అఫ్ఘాన్‌లో బలపడేందుకు తాలిబన్లు డ్రాగన్ సాయం కోరుతున్నారు. ఇటు తాలిబన్లను శత్రు దేశాలపై అస్త్రంగా వాడుకోవాలని చైనా చూస్తోంది.
అఫ్ఘానిస్తాన్‌లో పరిస్థితి అంతకంతకు దిగుజారుతోంది. అమెరికా, నాటో దళాల ఉపసంహరణ తర్వాత పరిస్థితి మరింత దారుణంగా మారింది. ఎక్కడ చూసిన రక్తపాతమే కన్పిస్తోంది. బాంబుల మోతలతో ఆ దేశం దద్దరిల్లుతోంది. ఇప్పటికే దాదాపుగా 85 నుంచి 90 శాతం భూభాగం తమ చేతుల్లోనే ఉందని తాలిబన్ నేతలు ప్రకటిస్తున్నారు. తాలిబన్లను ఎదుర్కోలేక అఫ్ఘాన్ ప్రభుత్వ బలగాలు చేతులెత్తేస్తున్నాయి.
చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని రష్యా, అమెరికా లాంటి దేశాలు సలహాలు ఇస్తున్నా.. అక్కడ పరిస్థితి చక్కదిద్దే ప్రయత్నం చేయడం లేదు. అఫ్ఘాన్‌లో ఎవరి జోక్యాన్ని తాము సహించేది లేదని తాలిబన్ నేతలు తెగేసి చెబుతున్నారు.