పాక్ ప్రేరేపిత లష్కరే తోయిబా, జైషే మహ్మద్ సంస్థలకు చెందిన ఉగ్రవాదులు పంజాబ్ రాష్ట్రంలోని పాక్ సరిహద్దుల్లో ఉన్న పఠాన్‌కోట్, గురుదాస్‌పూర్ జిల్లాల్లో ఉగ్రదాడులకు పాల్పడే అవకాశముందని కేంద్ర ఇంటలిజెన్స్ వర్గాలు చేసిన హెచ్చరికలతో పంజాబ్ పోలీసులు, కేంద్రపారామిలటరీ దళాలు అప్రమత్తమయ్యాయి.
గత నెలలో పాకిస్థాన్ నుంచి వచ్చిన 8 డ్రోన్లలో 80కిలోల బరువున్న తుపాకులు వచ్చాయని భద్రతా బలగాల దర్యాప్తులో తేలింది. పాక్ సరిహద్దుల్లో దాక్కున్న ఉగ్రవాదులు దాడులకు తెగబడవచ్చని గూడాచార వర్గాలు చేసిన హెచ్చరికలతో 5వేలమంది సాయుధ పోలీసులు, కేంద్ర బలగాలతో కలిసి రెండు జిల్లాల్లో విస్తృతంగా గాలిస్తున్నారు.
పంజాబ్ పోలీసు అదనపు డైరెక్టరు జనరల్ (లా అండ్ ఆర్డర్) ఈశ్వర్ సింగ్, గ్రూప్ కమాండో అదనపు డీజీ రాకేష్ చంద్రల ఆధ్వర్యంలో సాయుధ పోలీసు బలగాలు వాహనాల తనిఖీలు చేపట్టాయి. దీంతోపాటు అనుమానమున్న ప్రాంతాల్లో ఉగ్రవాదుల జాడ కోసం మిలటరీ ఇంటలిజెన్స్, బీఎస్ఎఫ్, ఎన్ఐఏ బలగాలు గాలిస్తున్నాయని పంజాబ్ పోలీసు చీఫ్ దినకర్ గుప్తా చెప్పారు.
ఒకవైపు ఉగ్రవాదుల కోసం గాలింపును ముమ్మరం చేయడంతోపాటు పఠాన్‌కోట్, గురుదాస్‌పూర్, బటాలా ఆసుపత్రుల్లో కనీసం 8 పడకలను అత్యవసర సేవల కోసం సిద్ధంగా ఉంచాలని భద్రతాబలగాలు ఆదేశించాయి. మొత్తంమీద సాయుధ బలగాల గాలింపుతో పంజాబ్ రాష్ట్రంలోని పాక్ సరిహద్దు జిల్లాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందోనని జనం భయాందోళనలు చెందుతున్నారు.