ఆంధ్రప్రదేశ్ రాజ్‌భవన్‌కు సంబంధించిన అన్ని ఏర్పాట్లు త్వరితగతిన పూర్తి చేస్తున్నామని రాష్ర ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం తెలిపారు. రాష్ట్ర ప్రధమ పౌరునికి ఎటువంటి ఆసౌకర్యం కలగకుండా యుద్ధ ప్రాతిపదికన పనులు జరుగుతున్నాయన్నారు. రాజ్ భవన్‌లో జరుగుతున్న పనులను సిఎస్ శనివారం పరిశీలించారు.
రాష్ట్ర డిజిపి గౌతంగ్ సవాంగ్, జిఎడి కార్యదర్శి ఆర్‌పి సిపోడియా, నగర పోలీస్ కమీషనర్ ద్వారకా తిరుమలరావు, గవర్నర్ వారి కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా, విజయవాడ మున్సిపల్ కమీషనర్ ప్రసన్న వెంకటేష్ ప్రోటోకాల్ డైరెక్టర్ ప్రవీణ్ కుమర్, విజయవాడ సబ్ కలెక్టర్ మిషా సింగ్ తదితరులతో కలిసి ఎల్‌వి సుబ్రమణ్యం రాజ్ భవన్ ఏర్పాట్లను పరిశీలించి, రాష్ట్ర యంత్రాంగానికి పలు ఆదేశాలు జారీ చేసారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 23వ,తేదిన ఎపికి గవర్నర్ వస్తారని, తోలుత తిరుమల శ్రీ వారి దర్శనం చేసుకొని నేరుగా గన్న వరం విమానాశ్రయంకు చేరుకుంటారన్నారు. విమానాశ్రయంలోనే ఆయనకు ముఖ్యమంత్రి, ఇతర మంత్రులు, అధికారి యంత్రాంగం స్వాగతం పలుకుతారన్నారు. తొలిసారి గవర్నర్ హోదాలో ఆంధ్రప్రదేశ్‌కు చేరుకుంటున్న విశ్వభూషన్ హరిచందన్‌కు రాజలాంఛనాలతో స్వాగతం పలుకుతారని, ఈ క్రమంలో త్రివిధ దళాల గౌరవ వందనం స్వీకరిస్తారని తెలిపారు.
విమానాశ్రయం నుండి నేరుగా అమ్మవారి దర్శనానికి వెళతారని, కార్యక్రమాల అనంతరం రాజ్‌భవన్ చేరకుని రాత్రికి అక్కడే బసచేస్తారని సిఎస్ పేర్కొన్నారు. అన్ని రకాల భద్రతా ఏర్పాట్లు పూర్తి అయ్యాయని, స్వయంగా డిజిపి సెక్యురిటీ గురించిన అన్ని చర్యలు తీసుకుంటున్నారని, అవసరమైన సిబ్బందిని ఇప్పటికే సిద్దం చేసామన్నారు. 24వ తేది ఉదయం 11:30 గంటలకు గవర్నర్ ప్రమాణ స్వీకారం చేస్తారని, అనంతరం ప్రముఖులకు తేనీటి విందు ఉంటుందని తెలిపారు.
గవర్నర్ బంగళాలో ఉన్న స్ధలాభావం దృష్టా కేవలం సిఎం, చీఫ్ జస్టిస్ ప్రయాణించే వాహనాన్ని మాత్రమే లోపలికి అనుమతిస్తారని, మంత్రులతో సహా అందరూ విఐపిలను గేటు వద్ద నుండి బ్యాటరీ కారులో లోపలికి తీసుకువచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. తెలంగాణ నుండి ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన అధికారులు విజయవాడ చేరుకున్నారని, వారికి గవర్నర్ కార్యదర్శి మీనా బాధ్యతలు అప్పగిస్తారని ఎల్‌వి సుబ్రమణ్యం పేర్కొన్నారు. అనంతరం ముఖేష్ కుమార్ మీనా మాట్లాడుతూ అవాంతరాలు ఉన్నప్పటికీ వివిధ ప్రభుత్వ శాఖల సహకారంతో సకాలంలో పనులు చక్కబరచాలన్న ప్రయత్నంలో ఉన్నామన్నారు.
రాజ్‌భవన్‌కు సంబంధించిన అధికారిక వెబ్ సైట్‌ను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సూచనల మేరకు పని చేస్తున్నామని, గవర్నర్ వ్యక్తిగత సిబ్బంది, ఇతర అవసరాలకు వసతి కల్పించవలసి ఉందని, దశలవారిగా ఆ ఏర్పాట్లను పూర్తి చేస్తామని మీనా పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రాముఖ్యత కలిగిన కలంకారి డిజైన్లను రాజ్‌భవన్‌లో ఏర్పాటు చేయాలని లేపాక్షిని అదేశించామన్నారు.
డిజిపి సూచనల మేరకు రాజ్ భవన్ నలు దిశలా ప్రత్యేకంగా సెక్యురీటీ పోస్టులు ఏర్పాటు చేసి లైటింగ్ పెంచుతామని, తదనుగుణంగా ఆర్ అండ్ బికి ఆదేశాలు జారీ చేసామని గవర్నర్ కార్యదర్శి మీనా తెలిపారు. ప్రోటోకాల్ ఏర్పాట్ల విషయంలో జాగురూకతతో వ్యవహరించాలని సిసోడియా అన్నారు. లోటుపాట్లకు ఆస్కారం లేకుండా సమన్వయంతో వ్యవహరించాలన్నారు.