క్రిస్మస్ పండుగ ముందు రోజే పాకిస్థాన్‌లో దారుణం జరిగింది. పాక్‌లో మద్య నిషేధం అమలులో ఉన్నప్పటికీ.. ఇస్లాం మినహా ఇతర మతస్థులకు కొన్ని సడలింపులున్నాయి. పాకిస్థాన్‌లో కల్తీ మద్యం సేవించి 32 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 50 మంది తీవ్ర అస్వస్థతకు గురైనారు. ఈ ఘటన టొబా టెక్ సింగ్ నగరంలోని ఓ క్రైస్తవ కాలనీలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. క్రిస్మస్ పండుగ ముందు రోజు రాత్రి వేడుకలో భాగంగా.. కొందరు వ్యక్తులు తయారు చేసిన మద్యాన్ని స్థానికులు సేవించారు.
సోమవారం ఉదయానికి వారిలో కొందరు మృతి చెందగా, మరికొంతమంది ఆస్పత్రి పాలైనారు. బాధితుల్లో ఎక్కువ మంది క్రైస్తవులే. ఘటనపై విచారణ జరిపేందుకు ప్రభుత్వం ఓ కమిటీని నియమించింది. సదరు మద్యం తయారు చేసిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.