చైనాలో భూకంపం.. ఢిల్లీలో ప్రకంపనలు...

వరుణ్

మంగళవారం, 23 జనవరి 2024 (08:48 IST)
పొరుగుదేశం చైనాలో భూకంపం సంభవించింది. దీని ప్రభావం రిక్టర్ స్కేలుపై 7.2 తీవ్రతగా నమోదైంది. ఈ భూకంపం ప్రభావం కారణంగా ఢిల్లీలో భూమి కంపించింది. ఈ భూకంప కేంద్రానికి భూమికి అడుగు భాగంలో 70 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రంగా గుర్తించారు. దీని ప్రభావం కారణంగా సోమవారం రాత్రి 11.39 గంటల సమయంలో ఢిల్లీలోనూ భూప్రకంపనలు కనిపించాయి. ఈ వివరాలను నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ వెల్లడించింది. అయితే, ఈ భూకంపం వల్ల ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించలేదని పేర్కొంది. 
 
జనవరి 11వ తేదీన ఆప్ఘనిస్థాన్‌లో రిక్టర్ స్కేలుపై 6.1 తీవ్రతతో భూకంపం సంభవించిన సమయంలో కూడా ఢిల్లీ రాజధాని ప్రాంతంలో భూప్రకంపనలు నమోదైన విషయం తెల్సిందే. ఆ భూకంపం కేంద్రం ఆప్ఘనిస్థాన్ రాజధాని కాబూల్‌కు ఈశాన్య దిశలో 241 కిలోమీటర్ల దూరంలో గుర్తించారు. దీంతో పాకిస్థాన్ దేశంలో కూడా భూప్రకంపనలు నమోదయ్యాయి. 
 
ఇదిలావుంటే, చైనా దేశంలో ఇటీవలి కాలంలో వరుసగా ప్రకృతి వైపరీత్యాలను చవిచూస్తుంది. సోమవారం ఉదయం నైరుతి చైనాలోని మారుమూల, పర్వత ప్రాంతంలో భారీ భూకంపం సంభవించింది. భూకంపం ప్రభావంతో కొండ చరియలు విరిగిపడ్డాయి. దీంతో ఏకంగా 47 మంది ప్రాణాలు కోల్పోయారు. 200 మందిని రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. యున్నాన్ ప్రావిన్స్‌లోని జెన్ క్యాంగ్ కౌంటీలో సోమవారం ఉదయం 5.51 గంటల సమయంలో కొండ చరియలు విరిగిపడటంతో విపత్కర పరిస్థితి నెలకొందని చైనా మీడియా జిన్హువా వెల్లడించింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు