అమెరికా అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తోన్న తరుణంలో రిపబ్లికన్ పార్టీ అభ్యర్ధి డోనాల్డ్ ట్రంప్ ప్రాతినిథ్యం వహిస్తోన్న రిపబ్లికన్ పార్టీ కార్యాలయంపై గుర్తుతెలియని దుండగులు బాంబు దాడి చేశారు. ఈ అంశం అమెరికాను కుదిపేస్తోంది. ఇప్పటికే అమెరికాలో రాజకీయాలతో ట్రంప్ - హిల్లరీ మాటలు అగ్గి రాజుకుంటున్ననేపథ్యంలో ఇలాంటి ఘటన జరగడాన్ని తీవ్రంగా పరిగణించిన రిపబ్లికన్ పార్టీ ఈ సంఘటనను "రాజకీయ ఉగ్రవాదం"గా అభివర్ణించింది.
నార్త్ కరోలినాలోని హిల్స్‌బరో ప్రాంతంలో ఉన్న ట్రంప్ ఆఫీసుపై పెట్రోలు బాంబ్‌లు వేయడంతో అందులోని సామాన్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. రాబోయే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో నార్త్ కరోలినా రాష్ట్రంలో హిల్లరీ క్లింటన్, డోనాల్డ్ ట్రంప్ మధ్య పోటీ రసవత్తరంగా ఉండనుంది. దాడి చేసిన వారు ట్రంప్ ఆఫీసులోని గోడలపై " రిపబ్లికన్లు ఊరు విడిచి వెళ్లాలి" అని రాయడం కలకలం సృష్టించింది. ఇదంతా హిల్లరీ పార్టీకి చెందిన వారే చేశారంటూ ట్రంప్ ఒక ట్వీట్ చేశారు. అందులో తన ఆక్రోశాన్ని అంతా వెళ్లగక్కారు. 'హిల్లరీని సమర్థిస్తున్న జంతువులే ఈ ఘాతుకానికి ఒడిగట్టాయి' అని అన్నారు.
రిపబ్లికన్ పార్టీ గెలవబోతోందన్న అక్కసుతోనే ఇలాంటి చర్యలకు దిగుతున్నారని, బాంబు దాడి ఘటనను ఎన్నటికీ మరచిపోమని, అక్కడ తమ గెలుపు ఖాయమైందని ట్రంప్ ఆరోపించాడు. మరోవైపు ఈ బాంబు దాడిని ఖండించి డెమోక్రటిక్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్.. ఈ దాడిలో ప్రాణనష్టం జరగనందుకు సంతోషిస్తున్నానని ట్వీట్ చేశారు. అదే సమయంలో ఈ దాడిపై ఆమె అనుమానం కూడా వ్యక్తం చేశారు. ఇందులో ఏదైనా రాజకీయ కుట్ర వుందా లేదా అన్న విషయంపై విచారణ జరగాలని కోరారు.