నా బలం నీకు ప్రమాదం ఎందుకవుతుంది మిత్రమా: చైనాకు భారత్ బుజ్జగింపు

గురువారం, 19 జనవరి 2017 (02:48 IST)
భారత్ అభివృద్ధి చెందటం అనేది చైనాకు ఎన్నడూ ప్రమాదకరం కాదని, అలా ఆ దేశం భావించాల్సిన అవసరం లేదన భారత విదేశాంగ శాక చైనాకు నచ్చచెప్పే ప్రయత్నం చేసింది. ఒకరి పెరుగుదల మరొకరికి ప్రమాదమని ఎవ్వరూ భావించాల్సిన పని లేదని, సార్వభౌమత్వానికి సంబంధించిన అంశాల్లో ఇరుదేశాలు సున్నితంగా వ్యవహరించాల్సి ఉందని భారత్ సూచించింది.
 
భారత విదేశీ మంత్రిత్వ శాఖ కార్యదర్శి ఎస్. జయశంకర్ న్యూఢిల్లో రైజినా చర్చల్లో పాల్గొంటూ భారత అభివృద్ధి చైనాకు ఎన్నటికీ ప్రమాదకరం కాదనే విషయంపై ఆ దేశానికి నచ్చచెప్పేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. అణు సరఫరాదారుల బృందంలో భారత సభ్యత్వానికి చైనా పదే పదే వ్యతిరేకత తెలుపుతున్న నేపథ్యంలో ఇరుదేశాల సంబంధాలు దెబ్బతిన్నాయి. అలాగే మసూద్ అజర్‌ని గ్లోబల్ టెర్రరిస్టుగా ప్రకటించాలని ఐక్యరాజ్యసమితిలో భారత్ చేసిన ప్రయత్నాన్ని కూడా చైనా అడ్డుకోవడం ఇరుదేశాల సంబంధాలను కాస్త మసకబర్చాయి. 
 
ఒక దేశం అభద్రత కారణంగానే సార్క్ కూటమి నిర్వీర్యమై పోయిందని విదేశీ కార్యదర్శి జయశంకర్ అభిప్రాయపడ్డారు. ఉగ్రవాదాన్ని గుర్తించడమనేది అంతర్జాతీయ భద్రతకు పెను సవాలుగా మారిందని ప్రపంచం ఉగ్రవాదానికి వ్యతిరేకంగా స్పందించడమే ఇప్పుడు అత్యున్నత ప్రాధమ్యాన్ని కలిగి ఉందని సూచించారు. 
 
వ్యాపారం, ప్రజల మధ్య సంబంధాలు వంటి అంశాల్లో భారత్, చైనా మధ్య విస్తరించిన సంబంధాలు కొన్ని రాజకీయ సమస్యల కారణంగా మసకబారుతున్నాయని, కానీ తమ మథ్య ఉన్న వ్యూహాత్మక స్వభావాన్ని  ఇతరేతర అంశాలు దెబ్బతీయకూడదని జయశంకర్ పేర్కొన్నారు.
 

వెబ్దునియా పై చదవండి