రష్యా తీరంలో భారీ భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 8.7గా నమోదైంది. జపాన్ వాతావరణ శాఖ ఈ విషయాన్ని వెల్లడించింది. ఈ క్రమంలోనే రష్యాలోని కమ్‌చట్కా ద్వీపకల్పంతో పాటు జపాన్‌కు కూడా సునామీ హెచ్చరికలు జారీ చేసింది. జపాన్‌లోని నాలుగు పెద్ద దీవులకు ఉత్తరాన ఉన్న హక్యైడో నుంచి దాదాపు 250 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
ఈ భూకంపం కారణంగా రానున్న మూడు గంటల్లో రష్యా, జపాన్ తీర ప్రాంతాల్లో పెద్దఎత్తున సునామీ అలలు రావొచ్చని యూఎస్ జియోలాజికల్ సర్వే(యూఎస్ఓఎస్) పేర్కొంది. అలస్కా అలూటియన్ దీవులలోని కొన్ని ప్రాంతాల్లో సునామీ ప్రభావం ఉంటుందని అలస్కా జాతీయ సునామీ కేంద్రం హెచ్చరించింది. కాలిఫోర్నియా, ఒరెగాన్, వాషింగ్టన్, హవాయితో సహా పలు ప్రాంతాలను అప్రమత్తం చేసింది.
ఇప్పటివరకు ప్రాణ, ఆస్తి నష్టానికి సంబంధించిన ఎలాంటి సమాచారం తెలియలేదు. భూప్రకంపనల నేపథ్యంలో పెట్రోపావ్‌లోవ్స్క్- కామ్చాట్స్కీ నగరంలోని భవనాలు కంపించాయని రష్యా మీడియా తెలిపింది. దీంతో భయభ్రాంతులకు గురైన ప్రజలు ఇళ్ల నుంచి పరుగులు తీసినట్లు తెలిపింది. కామ్చాట్స్కీ ప్రాంతంలో విద్యుత్, సెల్ ఫోన్ సేవల్లో అంతరాయాలు ఏర్పడినట్లు తెలిపింది. భవనాలు అత్యవసర సేవల కోసం ఒక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసినట్లు జపాన్ ప్రభుత్వం పేర్కొంది. ఈ ప్రకంపనలకు సంబంధించిన తీవ్రతను తెలిపే వీడియోలు తాజాగా బయటకు వచ్చాయి.