అరబ్ దేశాల్లో యూఏఈ ఒకటి. అన్ని అరబ్ దేశాల్లో ముస్లిం చట్టాలు చాలా కఠినంగా అమలు చేస్తుంటారు. అయితే, యూఏఈ ప్రభుత్వం ఈ నిబంధనలు పక్కనబెట్టింది. హిందూ అబ్బాయికి - ముస్లిం అమ్మాయికి పుట్టిన బిడ్డకు జనన ధృవీకరణ పత్రాన్ని జారీచేసింది.
ఈ వివరాలను పరిశీలిస్తే, సాధారణంగా ఇస్లాం చట్టాల మేరకు ముస్లిం అబ్బాయి ఇతర మతాలకు చెందిన అమ్మాయిలను పెళ్ళి చేసుకోవచ్చు. వారికి పుట్టే బిడ్డలకు అరబ్ దేశాలు జననధృవీకరణ పత్రాలు జారీచేస్తాయి. అదే ముస్లిం అమ్మాయి ఇతర మతాలకు చెందిన అబ్బాయిలను పెళ్లిళ్లు చేసుకుని బిడ్డలకు జన్మనిస్తే, అలాంటి బిడ్డలకు జనన ధృవీకరణ పత్రాలు ఇవ్వరు.
అయితే, ఇపుడు ఇయర్ ఆఫ్ టాలిరెన్స్ సందర్భంగా యూఏఈ ప్రభుత్వం నిబంధనలను సైతం పక్కన పెట్టి ఓ హిందూ అబ్బాయి, ముస్లిం అమ్మాయికి పుట్టిన బిడ్డకు సర్టిఫికెట్‌ను జారీ చేసింది. కేరళకు చెందిన కిరణ్ (హిందూ), సనమ్ సబు సిద్దిక్(ముస్లిం) 2016లో పెళ్లి చేసుకుని అబూదాబీలో నివసిస్తున్నారు. 2018 జులైలో వారికి ఓ పాప పుట్టింది. యూఏఈ నిబంధనల ప్రకారం వారికి పుట్టిన పాపకు జననధృవీకరణ పత్రం జారీచేయలేదు.
దీంతో కిరణ్ నో అబ్జక్షన్ లెటర్ (ఎన్.ఓ.సి) కోసం ఆ దేశ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. నాలుగు నెలల తర్వాత కోర్టు కిరణ్ అభ్యర్థనను తోసిపుచ్చింది. ఆ తర్వాత యూఏఈలోని భారత రాయబార కార్యాలయ అధికారుల సహాయంతో కిరణ్ ఆ దేశ న్యాయ విభాగాన్ని కలిశాడు. ఇలాంటి పరిస్థితులు ఏర్పడినప్పుడు మొదటగా చీఫ్ జస్టిస్‌కు విజ్ఞప్తి లేఖ పెట్టుకోవాలని, ప్రధాన న్యాయమూర్తి అంగీకారం తెలిపిన లెటర్‌ను దేశ ఆరోగ్యం శాఖ వర్గాలకు అందిస్తే అపుడు జనన ధృవీకరణ పత్రం జారీచేస్తారని యూపీఏ న్యాయ శాఖ సలహా ఇచ్చింది.
ఆ తర్వాత న్యాయవిభాగం తెలిపిన విధంగా చేయగా.. కిరణ్, సనమ్ దంపతులకు జన్మించిన అనామ్తా ఏసెల్లెన్ కిరణ అనే పాపకు నిబంధలను పక్కనపెట్టి తొలిసారిగా ఏప్రిల్ 14వ తేదీన యూఏఈ ప్రభుత్వం జనన ధృవీకరణ పత్రాన్ని ఇచ్చింది.