జార్జియాలో రీకౌంటింగ్‌లోనూ ఓడిన డోనాల్డ్ ట్రంప్... మిచిగన్‌లో వెనుకడుగు..

శుక్రవారం, 20 నవంబరు 2020 (10:31 IST)
అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఇటీవల వెల్లడయ్యాయి. అయితే, ఈ ఎన్నికల్లో అక్రమాలు జరిగాయనీ, రిగ్గింగ్‌కు పాల్పడినట్టు ప్రస్తుత అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఆరోపిస్తున్నారు. దీంతో పలు రాష్ట్రాల్లోని జరిగిన ఓట్ల లెక్కింపుపై న్యాయపోరాటం చేస్తున్నారు. ఇందులోభాగంగా, జార్జియా రాష్ట్రానికి సంబంధించి రీకౌంటింగ్ జరిగింది. ఇక్కడ జో బైడెన్ గెలుపొందారు. మూడు దశాబ్దాల తర్వాత డెమొక్రటిక్ అభ్యర్థి విజయం సాధించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. 
 
నిజానికి జార్జియాలో తనదే విజయమని, కౌంటింగ్‌లో అవకతవకలు జరిగాయని ఆరోపించిన ట్రంప్ టీమ్, రీకౌంటింగ్‌కు పట్టుబట్టారు. కానీ, ఆయనకు చుక్కెదురైంది. ఇక జార్జియా ఫలితాలు వ్యతిరేకంగా రావడంతో మిచిగన్ విషయంలో కోర్టులో వేసిన పిటిషన్‌ను విత్ డ్రా చేసుకోవాలని నిర్ణయించుకుంది.
 
మరోవైపు, జార్జియా ఓటింగ్ సిస్టమ్ అధికారి గాబ్రియేల్ స్టెర్లింగ్, రీకౌంటింగ్ తర్వాత బైడెన్ అడ్వాంటేజ్‌లో ఉన్నారని 'ఫాక్స్ న్యూస్' వార్తా సంస్థకు వెల్లడించారు. కౌంటింగ్‌లో ఎటువంటి అవకతవకలూ జరగలేదని స్పష్టం చేశారు. కౌంటింగ్ అధికారులు వారి విధిని సక్రమంగానే నిర్వహించారు. అతి కొద్ది ఓట్లను మాత్రమే నాడు లెక్కించలేదు. ఆపై రీకౌంటింగ్ కూడా గొప్పగా జరిగిందని ఆయన అన్నారు.
 
కాగా, అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించడానికి 270 ఎలక్టోరల్ ఓట్లు అవసరం కాగా, బైడెన్ 306 ఓట్లను, ట్రంప్ 232 ఓట్లను సంపాదించారు. ఆపై చాలా రాష్ట్రాల్లో ట్రంప్ టీమ్ కోర్టులను ఆశ్రయించగా, పలు కేసులను న్యాయమూర్తులు కొట్టిపారేశారు. ఇక మిచిగన్‌లో వేసిన పిటిషన్‌ను వెనక్కు తీసుకుంటున్నట్టు ట్రంప్ న్యాయవాది రూడీ గియులానీ తెలియజేశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు