బీహార్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అనూహ్యంగా పుంజుకుంది. మంగళవారం ఉదయం నుంచి ప్రారంభమైన ఓట్ల లెక్కింపులో తొలుత మహా కూటమి ఆధిక్యంలో కొనసాగింది. ఆ తర్వాత బీజేపీ అనూహ్యంగా పుంజుకుంది. ఫలితంగా బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే కూటమి ఏకంగా 127 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇందులో బీజేపీ అత్యధిక స్థానాలు గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించింది. మహాగట్‌బంధన్ పార్టీ 104 స్థానాల్లో లీడింగ్‌లో ఉంది.
అయితే, గత 15 ఏళ్ల నుంచి బీజేపీ, జేడీయూలు బీహార్‌లో కూటమి రాష్ట్రాన్ని పాలించాయి. ఈసారి కూడా ఇద్దరూ కలిసి పోటీ చేశారు. కానీ ఈసారి బీజేపీ అనూహ్య రీతిలో ఓటర్లను ఆకర్షించినట్లు తెలుస్తోంది. ఆ పార్టీ 73 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నది. 48 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్న జేడీయూ .. గతంతో పోలిస్తే దాదాపు 20కి పైగా సీట్లను కోల్పోయే ప్రమాదంలో ఉన్నది. ప్రధాని నరేంద్ర మోడీ హవా బీహార్‌లో కొనసాగినట్లు ప్రస్తుతం ఫలితాల ద్వారా అంచనా వేయవచ్చు.
ముఖ్యంగా, ఈ ఎన్నికల ఫలితాల తర్వాత బీజేపీ రాష్ట్రంలోనే అతిపెద్ద పార్టీగా అవతరించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇదే అనేక మందిలో ముచ్చెమటలు పోయిస్తోంది. ముఖ్యంగా, ప్రస్తుత ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌ను టెన్షన్‌కు గురిచేస్తోంది. ఎందుకంటే.. ఈ ఎన్నికల్లో ఎన్డీఏ సీఎం అభ్యర్థిగా నితీశ్ కుమార్ పేరును ఇరు పార్టీల నేతలు అధికారికంగా ప్రకటించారు. పైగా, తనకు ఇవే చివరి ఎన్నికలు అని కూడా నితీశ్ కుమార్ ప్రకటించారు.
కానీ ప్రస్తుత ఫలితాల్లో మాత్రం బీజేపీ ఒంటరిగా దూసుకువెళ్తోంది. ఈ తరుణంలో నితీశ్‌ను సీఎం అభ్యర్థిగా అంగీకరిస్తారా? లేదా? అన్న చర్చ మొదలైంది. బీజేపీ ఏకపక్షంగా ఎక్కువ స్థానాలను కైవసం చేసుకుంటే, అప్పుడు సీఎం ఎవరు అయితారన్న మీమాంస ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. తాజా లెక్కల ప్రకారం జేడీయూ కన్నా బీజేపీ ఎక్కువ స్థానాలను చేజిక్కించుకోనుందనే విషయం సుస్పష్టం. ఈ దశలో నితీశ్‌కు సీఎం పదవిని అప్పగిస్తారా? లేదా? వేచి చూడాల్సిందే.