5న అమెరికా అధ్యక్ష ఎన్నికలు... ఆ రాష్ట్రాల చేతిలోనే అభ్యర్థుల భవిత

ఠాగూర్

ఆదివారం, 3 నవంబరు 2024 (13:57 IST)
అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష పీఠానికి ఈ నెల 5వ తేదీన ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల కోసం ఎన్నికల అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఈ నేపథ్యంలో అధ్యక్ష రేసులో మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్, ప్రస్తుత ఉపాధ్యక్షురాలు, డెమొక్రటిక్ అభ్యర్థి కమల హారిస్‌లలో ఎవరు గెలుస్తారన్న ఉత్కంఠ సర్వత్రా ఆసక్తి నెలకొంది. 
 
ఇరు పార్టీలు చరిత్రాత్మకంగా భావిస్తున్న ఈ ఎన్నికల్లో ఇప్పటికే వివిధ దశల్లో 4.1 కోట్ల మంది అమెరికన్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 5వ తేదీన పోలింగ్ ముగిసిన వెంటనే అదే రోజు ఓట్ల లెక్కింపు చేపడతారు. అయితే, అధ్యక్షుడుని ప్రకటించేందుకు కొన్ని రోజుల సమయం పట్టే అవకాశం ఉంది. 
 
స్థానిక మీడియా వర్గాల సమాచారం ప్రకారం... ఓట్ల లెక్కింపు చేపట్టిన రాత్రి లేదా మరుసటి రోజు విజేతను ప్రకటించవచ్చని తెలుస్తోంది. ఇక, 'అసోసియేటెడ్ ప్రెస్' వంటి పెద్ద సంస్థలు ఇప్పటికే పలు సర్వేలు చేశాయి. పోలింగ్ ప్రక్రియ ముగియగానే ఈ సర్వే ఫలితాలను వెల్లడించనున్నాయి. 
 
సాధారణంగా 270 లేదా అంతకన్నా ఎక్కువ ఎలక్ట్రోరల్ కాలేజీ ఓట్లు సాధించిన అభ్యర్థిని విజేతగా పరిగణిస్తారు. ఇక, ఎవరు విజయం దక్కించుకున్నప్పటికీ 2025, జనవరి 20న శ్వేత సౌథంలో అడుగు పెట్టనున్నారు. ఈ ఎన్నికల్లో అత్యంత కీలక పాత్రను కొన్ని రాష్ట్రాలు పోషిస్తాయి. అధ్యక్ష ఎన్నికల బరిలో ఉండే అభ్యర్థుల జాతకాలను ఈ రాష్ట్రాల్లో నిర్ణయిస్తాయి. అందుకే వీటిని స్వింగ్ స్టేట్స్‌గా పిలుస్తారు. 
 
ఈ రాష్ట్రాల్లో జార్జియా, మిచిగాన్, పెన్సిల్వేనియా, అరిజోనా, విస్కాన్సిన్, నెవాడా, ఫ్లోరిడా రాష్ట్రాల ఓటర్లే అంతిమంగా అధ్యక్ష అభ్యర్థిని నిర్ణయిస్తారు. వీరితోపాటు మరో కీలక రాష్ట్రం ఓహియో కూడా ఉంది. గత రెండు దఫాలుగా ఈ రాష్ట్ర ప్రజల తీర్పు కూడా నిర్ణయాత్మకంగా మారింది. శ్వేతసౌథంలోకి అడుగు పెట్టాలనుకునేవారికి ఈ రాష్ట్రాల్లో గెలుపు అత్యంత కీలకంగా మారింది. మరీ ముఖ్యంగా గత కొన్ని ఎన్నికల నుంచి పెన్సిల్వేనియా కీలక పాత్ర పోషిస్తోంది. ఇక్కడ 19 ఎలక్టోరల్ కాలేజీ ఓట్లు ఉన్నాయి. ఇవి దక్కించుకోవడం కోసం అభ్యర్థులు ఎంతగానో శ్రమించారు. గత ఎన్నికల్లో జో బైడెన్ విజయం సాధించిన విషయం తెల్సిందే. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు