విషమంగా డోనాల్డ్ ట్రంప్ ఆరోగ్యం.. వచ్చే 48 గంటలే కీలకం!!!

ఆదివారం, 4 అక్టోబరు 2020 (10:26 IST)
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ పట్ల నిర్ల్యంగా వ్యవహరించడమే కాదు, తనను అదేం చేయదు అంటూ ప్రగల్భాలు పలికిన అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చివరకు ఆ వైరస్ బారినపడ్డారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం అత్యంత విషమంగా ఉన్నట్టు సమాచారం. ముఖ్యంగా వచ్చే 48 గంటలు అత్యంత కీలకమని వైద్యులు అంటున్నారు. 
 
ట్రంప్‌కు కరోనా వైరస్ సోకిన తర్వాత, 24 గంటల వ్యవధిలోనే ముఖ్యమైన అవయవాలు ప్రభావితం అయ్యాయని, ఇది కలవర పెట్టే అంశమని వైట్‌హౌస్‌కు చెందిన కీలక అధికారి ఒకరు వ్యాఖ్యానించడంతో దేశ ప్రజలతో పాటు.. ట్రంప్ అభిమానుల్లో ఆందోళన పెరిగింది. 
 
మరోవైపు, ట్రంప్ ఇప్పటికే స్థూలకాయం, కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండటంతో చికిత్స విషయంలో వైద్యులు కలవరపడుతున్నట్టు సమాచారం. ఆసుపత్రిలోనే తాత్కాలిక అధ్యక్ష కార్యాలయం ఏర్పడిందని, అక్కడి నుంచే కొంతకాలం పాటు ట్రంప్ విధులు నిర్వహిస్తారని వైట్‌హౌస్ ఓ ప్రకటనలో పేర్కొంది. 
 
ఇక ట్రంప్ భార్య మెలానియా ట్రంప్‌కు స్వల్పంగా దగ్గు మాత్రమే ఉందని, ఆమె త్వరగానే కోలుకుంటారని వైద్య వర్గాలు వెల్లడించారు. వైట్‌హౌస్ కువెళ్లిన ముగ్గురు మీడియా ఉద్యోగులకు, ఇద్దరు సెనెటర్లకు, ట్రంప్ ఎన్నికల ప్రచార మేనేజర్‌కు, మాజీ సలహాదారుడికి కూడా కరోనా సోకగా, వారందరికీ ఇప్పుడు చికిత్స జరుగుతోంది.
 
కరోనా వైరస్ బారినపడిన డోనాల్డ్ ట్రంప్‌కు తొలుత వైట్‌హౌస్‌లోనే చికిత్స పొందాలని ట్రంప్ భావించినప్పటికీ, ఆయన ఆరోగ్య పరిస్థితి, వయసు దృష్ట్యా, ప్రత్యేక హెలికాప్టర్‌లో వాల్టర్ రీడ్ సైనిక ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతానికి ఆయన కోలుకునేందుకు ఎంత సమయం పడుతుందో చెప్పలేమని, డిశ్చార్జ్ కావడానికి మరింత సమయం పడుతుందని, రెండు రోజుల తర్వాతే ఆయన ఆరోగ్యంపై ఓ అవగాహనకు రావచ్చని తెలుస్తోంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు