అంతర్జాతీయ నీలిచిత్రాల ముఠా గుట్టురట్టు

స్విట్జర్లాండ్ పోలీసులు ప్రపంచవ్యాప్తంగా 78 దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న బాలల నీలిచిత్రాల ముఠా గుట్టురట్టు చేశారు. ఈ అంతర్జాతీయ ముఠాలో మొత్తం 2000 మంది పనిచేస్తున్నట్లు భావిస్తున్నారు. ఇంటర్‌పోల్ ఇచ్చిన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని స్విట్జర్లాండ్ పోలీసులు ఈ ముఠా వ్యవహారాన్ని బయటపెట్టారు.

ఓ వెబ్‌సైట్‌ను ఉపయోగించుకొని ఈ ముఠా ప్రపంచవ్యాప్తంగా తన నెట్‌వర్క్‌ను నిర్వహిస్తోంది. ఈ వెబ్‌సైట్ యాజమాన్యాన్ని కూడా బాలల నీలిచిత్రాల వ్యవహారానికి సంబంధించి అధికారిక వర్గాలు విచారిస్తున్నాయి. హిప్- హాప్ మ్యూజిక్ కోసం ఉద్దేశించిన ఈ వెబ్‌సైట్‌లో గుర్తుతెలియని వ్యక్తులు అక్రమ బాలల నీలిచిత్రాలను దాచిపెట్టేందుకు ఓ ఫోరమ్‌ను ఉపయోగించుకున్నారు.

నీలిచిత్రాల ముఠా కార్యకలాపాలను పూర్తిస్థాయిలో బయటపెట్టేందుకు అధికారిక వర్గాలు దర్యాప్తును అమెరికా, పోలెండ్, గ్రీస్, ఇతర దేశాలకు కూడా విస్తరించాయి. ఈ దేశాల వ్యక్తులకు కూడా బాలల నీలిచిత్రాల ముఠాతో సంబంధాలు ఉన్నట్లు అనుమానిస్తున్నారు. స్విట్జర్లాండ్‌లో ఈ కేసుకు సంబంధించి 32 మంది అనుమానితులను నిర్బంధించినట్లు మీడియా కథనాలనుబట్టి తెలుస్తోంది.

వెబ్దునియా పై చదవండి