ఏడాది ఆఖరులోపు ఇరాక్ నుంచి అమెరికా బలగాలను ఉపసంహరించుకోవాలని పెట్టుకొన్న గడువు తర్వాత కూడా అమెరికా దళాలు ఉండటానికి ఇరాక్ ఒప్పుకున్నట్లు అమెరికా రక్షణ శాఖ కార్యదర్శి లియోన్ పనెట్టా శనివారం వెల్లడించారు. అనేక దఫాలు చర్చించిన అనంతరం వారు చివరికి ఆమోదం తెలిపారని పనెట్టా ఒక ఇంటర్వ్యూలో తెలిపారు.
ఇరాక్ సైనికులకు శిక్షణ ఇచ్చేందుకు గానూ కొంతమంది అమెరికా బలగాలను ఇరాక్‌లోనే ఉంచే విషయమై అమెరికాతో చర్చిస్తామని ఇరాక్ రాజకీయ నాయకులు ఆగస్ట్ 3న ప్రకటించారు. 2008లో కుదిరిన భద్రతా ఒప్పందం ప్రకారం ఇరాక్‌లో ఉంటున్న 46,000 మంది అమెరికా సైనికులు ఈ ఏడాది ఆఖరుకు ఆ దేశాన్ని వీడాల్సి ఉంటుంది. శిక్షణ కార్యక్రమంతో పాటు బలగాల ఉపసంహరణపై చర్చలు కొనసాగుతున్నట్లు పనెట్టా చెప్పారు.
2001లో అల్‌ఖైదా న్యూయార్క్‌లోని వరల్డ్ ట్రేడ్ టవర్స్‌పై దాడి చేసిన తర్వాత ఇరాక్‌లో మానవహనన ఆయుధాలు ఉన్నాయనే నెపంతో ఇరాక్‌లో అడుగుపెట్టిన అమెరికా సద్ధాం హుస్సేన్ పట్టుకొని ఉరితీయడంతో పాటు తీవ్ర విధ్వంసానికి పాల్పడింది.