అర్జెంటీనాలో మరో ఏడు స్వైన్ ఫ్లూ మరణాలు

దక్షిణ అమెరికాలో శీతాకాలం అడుగుపెట్టడంతో ఇక్కడి దేశాల్లో స్వైన్ ఫ్లూ వ్యాధి ప్రమాదకరంగా మారింది. అర్జెంటీనాలో స్వైన్ ఫ్లూ వ్యాధి బారినపడి మరో ఏడుగురు మృతి చెందారు. దీంతో దేశంలో మొత్తం స్వైన్ ఫ్లూ మరణాల సంఖ్య 17కి చేరుకుంది. స్వైన్ ఫ్లూ వ్యాధిని నియంత్రించేందుకు ప్రభుత్వ ఆస్పత్రులు కొన్ని శస్త్రచికిత్సలను సైతం వాయిదా వేస్తున్నాయి.

ఈ మేరకు అర్జెంటీనా ఆరోగ్య శాఖ అధికారులు వివరాలు వెల్లడించారు. తాజాగా ఏడుగురు పౌరులు స్వైన్ ఫ్లూ బారినపడి మృతి చెందారని, దీంతో మొత్తం మరణాల సంఖ్య 17 మందికి చేరుకుందని అధికారులు తెలిపారు. దక్షిణ అమెరికా ఖండంలో స్వైన్ ఫ్లూ కారణంగా మృతి చెందినవారి సంఖ్య అర్జెంటీనాలోనే ఎక్కువ.

స్వైన్ ఫ్లూ మరణాలన్నీ రాజధాని బ్యూనస్ ఎయిర్స్, దాని పరిసర ప్రాంతాల్లోనే సంభవించాయి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో స్వైన్ ఫ్లూ రోగులకు చికిత్స అందించేందుకు అత్యవసరంకాని శస్త్రచికిత్సలను వాయిదా వేయాలని అధికారిక యంత్రాంగానికి ఆదేశాలు జారీ అయ్యాయి. ఇదిలా ఉంటే మంగళవారం అర్జెంటీనాలో 74 కొత్త స్వైన్ ఫ్లూ కేసులు బయటపడ్డాయి. దీంతో మొత్తం స్వైన్ ఫ్లూ కేసుల సంఖ్య 1,294కి చేరుకుంది.

వెబ్దునియా పై చదవండి