సుదీర్ఘకాలం పాటు లిబియాను పాలించిన నియంత ముయమ్మార్ గడాఫీ దేశంలో తన పట్టు కోల్పోవడంతో గడాఫీ భార్యతో పాటు ఆయన పిల్లలు ముగ్గురు కూడా సోమవారం లిబియాను వీడి పొరుగున ఉన్న అల్జీరియాకు వెళ్లినట్లు గట్టి ఆధారాలు లభించాయి. అయితే గడాఫీతో పాటు ఆయన కుమారుడు సైఫ్ అల్ ఇస్లామ్‌లు దేశాన్ని వీడిన విషయం ఇంకా ధృవీకరించబడలేదు.
గడాఫీ లిబియాను వీడినట్లు తమ వద్ద సమాచారం లేదని సోమవారం ఒబామా ప్రభుత్వం కూడా వాషింగ్టన్‌లో పేర్కొంది. కాగా గడాఫీ సేనలతో జరుగుతున్న యుద్ధంలో నియంత కుమారుల్లో ఒకరైన మిలిటరీ కమాండర్ ఖామిస్ చనిపోయినట్లు తిరుగుబాటుదారులు సోమవారం తెలిపారు.
గడాఫీ భార్య సాఫియా, కుమారులు హన్నీబల్, మొహమ్మద్, కుమార్తె అయిషాలు సరిహద్దు నుంచి తమ దేశంలోకి ప్రవేశించినట్లు అల్జీరియా విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది. ఈ విషయాన్ని అల్జీరియా అధికారులు ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి, భద్రతా మండలి అధ్యక్షుడు, లిబియా తిరుగుబాటుదారుల నాయకత్వానికి తెలియజేశారు.