ఆఫ్ఘనిస్థాన్‌లో హత్యలపై దర్యాప్తుకు ఆదేశం

అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఆఫ్ఘనిస్థాన్‌లో 2001లో జరిగిన తాలిబాన్ ఖైదీల హత్యలపై దర్యాప్తుకు ఆదేశించారు. అమెరికాలో గతంలో అధికారంలో ఉన్న బుష్ పాలనా యంత్రాంగం ఆఫ్ఘనిస్థాన్‌లో జరిగిన తాలిబాన్ల హత్యలపై సరిగా దర్యాప్తు జరపలేదని ఆరోపణలు వచ్చాయి. దీనిపై దర్యాప్తు సరిగా జరగకుండా బుష్ యంత్రాంగం అడ్డుకుందని గతం ఆరోపణలు వచ్చాయి.

అమెరికా నేతృత్వంలోని సంకీర్ణ సేనలకు 2001లో సుమారు 2000 మంది తాలిబాన్ తీవ్రవాదులు లొంగిపోయారు. లొంగిపోయిన వందలాది మంది తాలిబాన్ ఖైదీలను అప్పటి ఆఫ్ఘనిస్థాన్ ఆర్మీ చీఫ్ జనరల్ అబ్దుల్ రషీద్ దోస్తూమ్ నేతృత్వంలోని సైన్యం చంపడం సంచలనం సృష్టించింది.

దోస్తూమ్‌కు అమెరికాకు చెందిన సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (సీఐఏ) మద్దతు ఉంది. తాలిబాన్ల సామూహిక హత్యలపై దర్యాప్తు సరిగా జరగని సంగతి ఇటీవలే తన దృష్టికి వచ్చిందని బరాక్ ఒబామా తెలిపారు. తమ జాతీయ భద్రతా బృందం దీనిపై తిరిగి దర్యాప్తు ప్రారంభిస్తుందని ఒబామా తెలిపారు.

వెబ్దునియా పై చదవండి