26/11, 9/11 ఉగ్రవాద దాడులకు కుట్రపన్నిన సూత్రధారులు తమ దేశంలో ఉన్నారని అమెరికా నిరాధారమైన ఆరోపణలు చేస్తోందని పాకిస్థాన్ ప్రభుత్వం ఆగ్రహం చేసింది. అమెరికా, భారత్‌లలో జరిగిన ఉగ్రవాద దాడుల సూత్రధారులు తమ దేశంలో నివసించడం లేదని స్పష్టం చేసింది.
ప్రస్తుతం భారత పర్యటనలో ఉన్న అమెరికా విదేశాంగ శాఖ కార్యదర్శి హిల్లరీ క్లింటన్ న్యూయార్క్‌లో 2001, సెప్టెంబరు 11, ముంబయిలో నవంబరు 26, 2008న జరిగిన ఉగ్రవాద దాడుల సూత్రధారులు పాకిస్థాన్‌లో ఉన్నారని ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ ఆరోపణలపై పాకిస్థాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి అబ్దుల్ బాసిత్ మాట్లాడుతూ.. ఈ దాడుల సుత్రధారులు పాకిస్థాన్‌లో లేరని స్పష్టం చేశారు.
వారు ఆఫ్ఘనిస్థాన్‌లో ఉన్నారని బాసిత్ పేర్కొన్నారు. న్యూఢిల్లీలో ఆదివారం హిల్లరీ క్లింటన్ చేసిన ఆరోపణలు నిరాధారమైనవన్నారు. అంతకుముందు హిల్లరీ క్లింటన్ ముంబయి ఉగ్రవాద దాడులకు బాధ్యులైనవారిపై పాకిస్థాన్ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. తీవ్రవాదాన్ని ప్రధాన సమస్యగా వర్ణించారు. ఇది ప్రపంచ శాంతికి ముప్పుగా మారిందన్నారు.
ఈ నేపథ్యంలో బాసిత్ మాట్లాడుతూ.. ముంబయి ఉగ్రవాద దాడులపై పాకిస్థాన్ ప్రభుత్వం ఓ క్రమపద్దతిలో దర్యాప్తును ముందుకు తీసుకెళుతుందని, ఈ విషయంలో తమ నిబద్ధతను ఏమాత్రం సంశయించరాదన్నారు. పాకిస్థాన్ నిఘా సంస్థలు దర్యాప్తును పకడ్బందీగా జరుపుతున్నాయని బాసిత్ తెలిపారు.