ఆఫ్ఘన్‌లో హెలికాఫ్టర్ కూలి 16 మంది మృతి

దక్షిణ ఆఫ్ఘనిస్థాన్‌లో ఆదివారం రష్యాకు చెందిన ఓ ప్రయాణిక హెలికాఫ్టర్ కూలడంతో 16 మంది మృతి చెందారు. ఆఫ్ఘనిస్థాన్‌లో నాటో దళాల అతిపెద్ద సైనిక స్థావరంలో ఈ ప్రమాదం జరిగింది. టేకాఫ్ తీసుకుంటున్న సమయంలో ఈ హెలికాఫ్టర్ కూలిపోయింది. ఈ ప్రమాదంలో 16 మంది పౌరులు మృతి చెందారని అధికారిక వర్గాలు తెలిపాయి. ముగ్గురు విమాన సిబ్బంది, మరో ఇద్దరు ప్రయాణికులు ప్రాణాలతో బయటపడ్డారు. గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారి ప్రస్తుత పరిస్థితి తెలియరాలేదు.

ఇదిలా ఉంటే ఆదివారం అమెరికా మిలిటరీకి చెందిన మరో హెలికాఫ్టర్ కూడా ఆఫ్ఘనిస్థాన్ తూర్పు ప్రాంతంలో అత్యవసర ల్యాండింగ్ అయింది. తీవ్రవాద చర్యలేవీ ఇందుకు కారణం కాదని అధికారిక వర్గాలు వెల్లడించాయి. దక్షిణ కాందహార్ వైమానిక స్థావరంలో రష్యాకు చెందిన ఎంఐ-8 హెలికాఫ్టర్ కూలిపోవడానికి కూడా తీవ్రవాదులేమీ కారణం కాదని మిలిటరీ అధికారులు చెప్పారు. సాంకేతిక సమస్యలకారణంగానే టాకాఫ్ తీసుకునే సమయంలో ఈ హెలికాఫ్టర్ మంటల్లో చిక్కుకొని పేలిందని అధికారులు పేర్కొన్నారు.

వెబ్దునియా పై చదవండి