ఇరాన్ వాయువ్య భాగంలో 168 మంది ప్రయాణికులు, సిబ్బందివున్న విమానం ఒకటి కూలిపోయింది. ఈ విమానంలోని ప్రయాణికులందరూ మృతి చెందారని ఇరాన్ ప్రభుత్వ మీడియా వెల్లడించింది. కాస్పియన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన జెట్ విమానం ఇరాన్ రాజధాని టెహ్రాన్ నుంచి అర్మేనియా రాజధాని యెరెవాన్‌కు వెళుతూ మార్గమధ్యంలో కూలిపోయింది.
టెహ్రాన్‌కు వాయువ్య దిశగా ఉన్న ఖాజ్విన్ నగర శివారుల్లోని జన్నతాబాద్ గ్రామం వద్ద ఈ విమాన ప్రమాదం జరిగిందని మీడియా కథనాలు వెల్లడించాయి. కాస్పియన్ ఎయిర్‌లైన్స్ జెట్ విమానం పూర్తిగా ధ్వంసమైందని, శకలాలు మంటల్లో కాలుతున్నాయని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. విమానంలోని ప్రయాణికులందరూ మృతి చెందారని ఇరాన్ అధికారిక వర్గాలు భావిస్తున్నాయి.
విమానంలో ఎంత మంది ప్రయాణికులు ఉన్నారో అధికారులు వెల్లడించలేదు. ఇరాన్ ప్రభుత్వం నడుపుతున్న ఐఆర్ఎన్ఏ వార్తా సంస్థ విమానంలో 153 మంది ప్రయాణికులు, 15 మంది సిబ్బంది ఉన్నట్లు తెలిపింది. రష్యా- ఇరాన్ దేశాలు సంయుక్తంగా 1993లో కాస్పియన్ ఎయిర్‌లైన్స్‌ను ఏర్పాటు చేశాయి. ఇదిలా ఉంటే ఇరాన్లో తరుచుగా విమాన ప్రమాదాలు జరుగుతుంటాయి.
అమెరికా ప్రోద్బలంతో తమపై విధించిన ఆంక్షలే తమ దేశంలో ప్రమాదాలకు కారణమని, తమ వద్ద ఉన్న విమానాలను ఆధునికీకరించేందుకు విడిభాగాలు రాకుండా ఈ ఆంక్షలు ద్వారా అమెరికా అడ్డుకుంటుందని ఇరాన్ ప్రభుత్వం ఆరోపిస్తోంది. కాస్పియన్ ఎయిర్‌లైన్స్ మాత్రం రష్యాలో తయారు చేసిన విమానాలు ఉపయోగిస్తోంది. వీటి నిర్వహణకు అమెరికా దిగుమతుల అవసరం పెద్దగా ఉండదు.