ఐదుగురు సిబ్బందిని విడిచిపెట్టిన ఇరాన్

ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లోని బ్రిటన్ దౌత్యకార్యాలయానికి చెందిన ఐదుగురు సిబ్బందిని ఆ దేశ అధికారిక యంత్రాంగం విడిచిపెట్టినట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి. బ్రిటన్ దౌత్యకార్యాలయంలో పనిచేస్తున్న స్థానిక సిబ్బందిని ఇరాన్ అధికారిక వర్గాలు ఆదివారం అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. దేశంలో అశాంతికి ఆజ్యం పోస్తున్నారనే ఆరోపణలపై వీరిని అరెస్టు చేశారు.

బ్రిటన్ దౌత్యకార్యాలయంలో అరెస్టు చేసిన ఎనిమిది మంది ఇరాన్ పౌరులే కావడం గమనార్హం. వీరిలో ఐదుగురిని విడిచిపెట్టినట్లు ఇరాన్ ప్రభుత్వ ప్రతినిధి హసన్ ఘష్ఘావీ టెహ్రాన్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. మిగిలిన ముగ్గురిని అధికారిక వర్గాలు ఇప్పటికీ విచారిస్తున్నాయని తెలిపారు.

ఇదిలా ఉంటే తమ దౌత్యకార్యాలయ సిబ్బంది ఇరాన్‌లో ఉద్రిక్తతలకు ఆజ్యం పోశారనే ఆరోపణలను బ్రిటన్ విదేశాంగ శాఖ కార్యదర్శి డేవిడ్ మిలిబాండ్ ఖండించారు. ఆ ఆరోపణలు నిరాధారమైనవన్నారు. మరోవైపు ఇరాన్‌లో ఈ నెల 12న జరిగిన వివాదాస్పద అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి సోమవారం ఎన్నికల సంఘం పాక్షిక రీకౌంటింగ్ జరుపుతోంది.

వెబ్దునియా పై చదవండి