పాకిస్థాన్ పార్లమెంట్ దేశ ఆర్థిక రాజధాని కరాచీలో క్షీణించిన శాంతి భద్రతలపై విచారణ జరపడానికి గానూ 17 మంది సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసింది. కొన్ని నెలలుగా జరుగుతున్న హింసలో కేవలం జులై నెలలోనే 300 మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఓడరేవు పట్టణమైన కరాచీలో ఈ హింసకు సంబంధం ఉన్న 185 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.
కరాచీ హింసపై దర్యాప్తు జరిపే కమిటీని జాతీయ అసెంబ్లీ స్పీకర్ ఫెమిదా మీర్జా నియమించారు. అన్ని రాజకీయ పార్టీల డిమాండ్ మేరకు స్పీకర్ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో అధికార పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ)కు చెందిన ఐదుగురు ఎంపీలు, ప్రతిపక్ష పార్టీలు పాకిస్థాన్ ముస్లీం లీగ్-నవాజ్ (పీఎంఎల్-ఎన్), పీఎంఎల్-క్యూల నుంచి నలుగురేసి ఎంపీలు, అవామీ నేషనల్ పార్టీ, ఎంక్యూఎం, జమాత్ ఉలేమా ఈ ఇస్లాం ఫజ్లూర్‌ల నుంచి ఒక్కొక్క ఎంపీకి చోటు కల్పించారు. కమిటీ బలూఛిస్థాన్‌లో పరిస్థితిని కూడా సమీక్షించి పార్లమెంట్‌కు తుది నివేదికను సమర్పిస్తుంది.