పాకిస్థాన్ తాలిబాన్ తీవ్రవాద సంస్థ చీఫ్ బైతుల్లా మెహసూద్ ముఖ్య అనుచరులు ఐదుగురు కరాచీలో హతమయ్యారు. పోలీసులు జరిపిన కాల్పుల్లో బైతుల్లా మెహసూద్ ముఖ్య అనుచరులు మృతి చెందారని అధికారిక వర్గాలు తెలిపాయి. కరాచీలోని ఓ తీవ్రవాద స్థావరంపై పోలీసులు అనూహ్యంగా దాడి చేశారు.
ఈ సందర్భంగా జరిగిన ఎన్‌కౌంటర్‌లో తెహ్రీక్ ఎ తాలిబాన్ పాకిస్థాన్ తీవ్రవాద సంస్థ చీఫ్ బైతుల్లా మోహసూద్ ముఖ్య అనుచరులుగా భావిస్తున్న ఐదుగురు వ్యక్తులు హతమయ్యారు. గడాప్ పట్టణంలోని ఓ రహస్య తీవ్రవాద స్థావరంలో ఉన్న వీరిని పోలీసులు మొదట లొంగిపోవాలని ఆదేశించారు.
అయితే వారు కాల్పులకు దిగడంతో పోలీసులు కూడా ఎదురు కాల్పులు జరిపారు. ఈ ఎన్‌కౌంటర్ నుంచి ఐదుగురు తీవ్రవాదులు తప్పించుకొని పరారయ్యారు. వీరి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి.
పాకిస్థాన్, అమెరికా ప్రభుత్వాలకు మోస్ట్‌వాంటెడ్ తీవ్రవాది అయిన బైతుల్లా మెహసూద్‌కు ఎన్‌కౌంటర్‌లో మరణించిన తీవ్రవాదులు ముఖ్య అనుచరులని కరాచీ నగర పోలీసు కమిషనర్ వాసీం అహ్మద్ గత రాత్రి విలేకరులతో చెప్పారు. దాడి చేసిన ప్రదేశం నుంచి పెద్దఎత్తున పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నామన్నారు.