గ్లోబల్ వార్మింగ్పై పోరాటం ప్రారంభించడంలో కాలయాపన జరుగుతోందని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా అభిప్రాయపడ్డారు. దీనిపై పోరాడేందుకు కాలం గడిచిపోతుందని పేర్కొన్నారు. వాతావరణ మార్పులను నిరోధించేందుకు అమెరికా ప్రభుత్వం కట్టుబడి ఉందని బరాక్ ఒబామా ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
భారత్తో సంబంధాల్లో వాతావరణం కూడా ప్రధానంశమని తెలిపారు. భారత్, చైనా వంటి దేశాలతో అమెరికా సంబంధాల్లో వాతావరణ మార్పులు కూడా కీలకాంశమన్నారు. దీనిపై చర్చలు నిలిచిపోవడానికి కొన్నిసార్లు ఈ దేశాలు కూడా కారణమన్నారు. ఐక్యరాజ్యసమితి వాతావరణ మార్పుల సదస్సులో వంద దేశాల నేతలను ఉద్దేశించి ప్రసంగిస్తూ ఒబామా ఈ వ్యాఖ్యలు చేశారు.
వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాలు కూడా దీనిని నిరోధించేందుకు తమ వంతు పాత్ర పోషించాల్సి ఉందన్నారు. వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలు కలిగిన దేశాల్లో భారత్, చైనాలు కూడా ఉన్నాయి. వాతావరణ మార్పులను నిరోధించడం ఏ ఒక్క దేశానికి సాధ్యమయ్యే పని కాదని ఒబామా పేర్కొన్నారు.
ఇదిలా ఉంటే ఐక్యరాజ్యసమితి వాతావరణ ఒప్పందంపై నిలిచిపోయిన చర్చలు పునరుద్ధరించేందుకు ఒబామా ఎటువంటి కొత్త ప్రతిపాదనలు చేయలేదు. ఇతర దేశాలతో సంబంధాల విషయానికి వచ్చేసరికి తమ దౌత్యంలో వాతావరణ మార్పుల అంశాన్ని ప్రధాన అజెండాగా పెట్టుకున్నామని తెలిపారు.
దీనికి ముందు ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి బాన్ కీ మూన్ మాట్లాడుతూ.. వాతావరణ మార్పులపై చర్చలు చాలా నెమ్మదిగా సాగుతున్నాయన్నారు. వాతావరణ మార్పులను అడ్డుకునేందుకు ఉద్దేశించిన ఒప్పందాన్ని ఈ ఏడాది డిసెంబరునాటికి పూర్తి చేసేందుకు ముందుకురావాలని ఈ సందర్భంగా ఆయన ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చారు.