చర్చల దారి వేరే: భారత్, పాక్ అంగీకారం

గత ఏడాది నవంబరులో జరిగిన ముంబయి ఉగ్రవాద దాడుల తరువాత పాకిస్థాన్ విషయంలో అనుసరిస్తున్న విధానానికి విరుద్ధంగా భారత ప్రభుత్వం గురువారం కొత్త మార్గాన్ని ఎంచుకుంది. గత కొన్ని నెలలుగా పాకిస్థాన్‌తో ముడిపడిన అన్ని విషయాలను తీవ్రవాదంపై తీసుకునే చర్యలతో భారత్ ముడిపెడుతున్న సంగతి తెలిసిందే.

ముఖ్యంగా ఇరుదేశాల మధ్య కీలక వివాదాలు పరిష్కరించుకునేందుకు ఉద్దేశించిన శాంతి ప్రక్రియ చర్చలును భారత్ నిలిపివేసింది. ఈ ప్రక్రియను పునరుద్ధరించేందుకు పాకిస్థాన్ ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా భారత ప్రభుత్వం మాత్రం దిగిరాలేదు. అయితే ఈజిప్టులో అలీనోద్యమ దేశాల సదస్సులో భాగంగా ఇరుదేశాల ప్రధానమంత్రుల మధ్య చర్చల్లో భారత్ కొంచం పట్టుసడలించింది.

తీవ్రవాదంపై తీసుకునే చర్యలతో చర్చలను ముడిపెట్టకుండా ఉండేందుకు అంగీకరించింది. తీవ్రవాదంపై పాకిస్థాన్ ప్రభుత్వం విశ్వసనీయ చర్యలు తీసుకుంటేనే తాము చర్చల పునరుద్ధరణ గురించి ఆలోచిస్తామని భారత్ గత కొంతకాలంగా స్పష్టం చేస్తోంది. అయితే భారత మంత్రి మన్మోహన్ సింగ్, పాకిస్థాన్ ప్రధాని గిలానీ మధ్య గురువారం జరిగిన చర్చల్లో భారత్ తన పంథా మార్చుకుంది.

చర్చలకు తీవ్రవాదంపై పోరుతో ముడిపెట్టకుండా ఉండేందుకు భారత్, పాకిస్థాన్ ప్రధానమంత్రులు అంగీకరించారు. ఈ మేరకు గిలానీ, మన్మోహన్ సింగ్ తమ సమావేశం అనంతరం సంయుక్త ప్రకటన విడుదల చేశారు. తీవ్రవాదం ఇరుదేశాలకు ముప్పేనని ప్రకటించారు. ఇదిలా ఉంటే తాజా ప్రకటనలో కాశ్మీర్ వివాదాన్ని ప్రస్తావించలేదు. గిలానీతో చర్చల అనంతరం భారత్ శాంతి ప్రక్రియను పునరుద్ధరించేందుకు సానుకూలంగా ఉన్నట్లు సంకేతాలు వచ్చాయి.

వెబ్దునియా పై చదవండి