చర్య తీసుకుంటేనే ఉమ్మడి చర్చలు: ప్రధాని

శుక్రవారం, 17 జులై 2009 (08:41 IST)
FileFILE
ముంబై దాడికి పాల్పడిన వారిపై తగిన చర్యలు తీసుకుంటేనే భారత్-పాకిస్థాన్ దేశాల మధ్య ఉమ్మడి చర్చలు జరుగుతాయని ప్రధాని మన్మోహన్ సింగ్ స్పష్టం చేశారు. ఈ విషయాన్ని పాక్ ప్రధాని యూసఫ్ రజా గిలానీకి ఆయన తేల్చి చెప్పారు. అయితే, ముంబై దాడికి సూత్రధారులుగా భావిస్తున్న కుట్రదారులను శిక్షించేంత వరకు పాక్‌తో చర్చలు జరుపబోమన్న ప్రధాని... తాజా పరిణామాల నేపథ్యంలో తన వైఖరిని కాస్త సడలించినట్టు తెలుస్తోంది.

అంతేకాకుండా, సింగ్, గిలానీల మధ్య జరిగిన చర్చలు కూడా ముంబై అంశం ప్రస్తావన లేకుండానే సాగాయి. దీనిపై స్వదేశంలో తీవ్రస్థాయిలో నిరసనలు వ్యక్తమయ్యాయి. ఆ వెంటనే తేరుకున్న ప్రధాని... వివరణ ఇచ్చారు. ఉగ్రవాదులపై చర్య తీసుకునే వరకు ఉమ్మడి చర్చలు ప్రారంభంకావని ఆయన విలేకరుల సమావేశంలో స్పష్టం చేశారు.

సుదీర్ఘ కాలంగా అపరిష్కృతంగా ఉన్న సమస్యలతో పాటు.. ఇతర అంశాలపైనా పాకిస్థాన్‌తో చర్చలు జరిపేందుకు పాక్ సుముఖంగా ఉందన్నారు. దేశ ఆర్థిక రాజధాని ముంబైను ముట్టడించిన ఉగ్రవాద దాడులపై సరైన దర్యాప్తు జరిపి నేరస్థులను శిక్షించకపోతే ఉమ్మడి చర్చలు తిరిగి ప్రారంభం కావు. ఇలాగే ఉగ్రవాదుల దాడులు కొనసాగితే పాకిస్థాన్‌తో చర్చల ప్రసక్తే లేదు. కనీసం ఉమ్మడి చర్చలు కూడా జరగవు అని ప్రధాని కఠినంగా అన్నారు.

వెబ్దునియా పై చదవండి