ఇండోనేషియా రాజధాని జకార్తాలో రెండు లగ్జరీ హోటళ్లలో శుక్రవారం ఉదయం జరిగిన బాంబు దాడుల్లో పాల్గొన్న ఓ అనుమానితుడిని ఆ దేశానికి చెందిన ఓ టీవీ ఛానల్ గుర్తించింది. మారియట్, రిడ్జ్- కార్ల్టన్ హోటళ్లపై జరిగిన బాంబు దాడుల్లో తొమ్మిది మంది మృతి చెందగా, 60 మంది గాయపడిన సంగతి తెలిసిందే.
ఈ ఆత్మాహుతి దాడుల అనుమానితుడిని గుర్తించామని మెట్రో టీవీ ఛానల్ వెల్లడించింది. ఈ అనుమానితుడికి అతివాద ఇస్లామిక్ గ్రూపు జెమాహ్ ఇస్లామియా సభ్యులతో పాఠశాల సంబంధాలు ఉన్నట్లు తెలిపింది. ఇదిలా ఉంటే ఇండోనేషియా పోలీసులు హోటళ్లపై జరిగిన దాడులకు జెమాహ్ ఇస్లామియా ప్రధాన సూత్రధారి అయివుండవచ్చని అనుమానిస్తున్నారు.
ఈ దిశగా దర్యాప్తు జరుపుతున్నారు. ఈ దాడుల్లో పాల్గొన్న ఓ ఆత్మాహుతి దళ సభ్యుడిని పోలీసులు ఎన్గా గుర్తించారు. అతనికి సంబంధించిన వివరాలేమీ వెల్లడించలేదు. అయితే మెట్రో టీప్ (ప్రైవేట్ టీవీ ఛానల్) పోలీసులు గుర్తించిన అనుమానితుడిని నుర్హాస్బిగా పేర్కొంది. అతని కుటుంబసభ్యులు నుర్హాస్బి కనిపించడం లేదని, ఫోన్లోనూ అందుబాటులో లేడని తెలిపారు.