జకార్తా హోటళ్లలో పేలుళ్లు: 9 మంది మృతి

జకార్తాలోని రెండు లగ్జరీ హోటళ్లలో శుక్రవారం ఉదయం సంభవించిన పేలుళ్లలో తొమ్మిది మంది మృతి చెందారు. మరో 50 మంది గాయపడ్డారు. ఇండోనేషియా రాజధానిలోని ప్రధాన వ్యాపార ప్రదేశంలో ఈ రెండు హోటళ్లు ఉన్నాయి. గాయపడినవారిలో ఒక న్యూజిలాండ్ పౌరుడు, మరో 13 మంది విదేశీయులు ఉన్నారని ఇండోనేషియా మంత్రి తెలిపారు.

ఈ పేలుళ్లు రిట్జ్- కార్ల్‌టన్, మారియట్ హోటళ్లలో సంభవించాయి. పేలుళ్లలో రెండు హోటళ్లు వెలుపలి భాగాలు ధ్వంసమయ్యాయి. కిటికీలు, ఇతర శకలాలు, పగిలిన అద్దాలు రోడ్లపైకి వచ్చిపడ్డాయి. మొదట మారియట్ హోటళ్లో పేలుడు సంభవించింది. అనంతరం మరో ఐదు నిమిషాలకే రిట్జ్ హోటల్‌లోనూ పేలుడు జరిగిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.

శనివారం, ఆదివారం రాత్రులు రిడ్జ్ హోటల్‌లో మాంచెస్టర్ యునైటెడ్ ఫుట్‌బాల్ జట్టు బస చేయాల్సివుంది. ఇండోనేషియన్ ఆల్ స్టార్స్ జట్టుతో ఫుట్‌బాల్ మ్యాచ్ ఆడేందుకు మాంచెస్టర్ యునైటెడ్ జట్టు ఇండోనేషియాకు వస్తోందని ఇండోనేషియన్ ఫుట్‌బాల్ అసోసియేషన్ తెలిపింది.

మారియట్ హోటల్‌లో 2003లో తీవ్రవాద దాడి జరిగింది. ఈ దాడిలో 12 మంది మృతి చెందారు. ఆగ్నేయాసియా తీవ్రవాద నెట్‌వర్క్ జెమాష్ ఇస్లామియా ఈ దాడికి పాల్పడినట్లు అనుమానాలున్నాయి. అనంతరం ఇండోనేషియా తీవ్రవాద నిరోధక యంత్రాంగం పెద్దఎత్తున భద్రతా చర్యలు చేపట్టడంతో గత మూడేళ్లలో ఇండోనేషియాలో ఒక్క తీవ్రవాద దాడి కూడా జరగలేదు.

వెబ్దునియా పై చదవండి