జపాన్ అధికార పార్టీ నూతన అధినేతగా ఆర్థికమంత్రి యోషిహికో నొడా ఎన్నికయ్యారు. దీంతో విపత్తులతో దేశం క్లిష్టపరిస్థితులను ఎదుర్కొంటున్న సమయంలో యోషిహికో నొడా నూతన ప్రధానమంత్రి కానున్నారు. 54 ఏళ్ల నొడా సాంప్రదాయ ఆర్ధికవేత్తగా పేరుంది. సోమవారం జరిగిన తొలి రౌండ్ ఓటింగ్‌లో పోటీ చేసిన ఐదుగురు అభ్యర్ధులు మెజారిటీ సాధించేలేకపోయారు. తిరిగి జరిపిన ఎన్నికలో నొడా వాణిజ్యమంత్రి బంరి కొయిడాను 215-177 ఓట్ల తేడాతో ఓడించారు.
మార్చిలో సంభవించిన సునామీ, అణు సంక్షోభాలతో భారీ స్థాయిలో నష్టపోయిన దేశ ఆర్థికవ్యవస్థ పునర్నిర్మాణంతో పాటు అనేక ఇతర సవాళ్లు నొడాకు స్వాగతం పలుకుతున్నాయి. అధికార డెమోక్రటిక్ పార్టీ పార్లమెంట్ దిగువ సభలో శక్తివంతంగా ఉన్నందున నొడా తదుపరి ప్రధానమంత్రి కానున్నారు. మార్చిలో సంభవించిన భూకంపం, సునామీ అనంతర పరిస్థితులను ఎదుర్కోవడంలో విఫలమైన ప్రస్తుత ప్రధానమంత్రి నొవొటో కన్ గద్దెదిగాలని ప్రతిపక్షాలతో పాటు స్వపక్ష ఎంపీలు గత కొంతకాలంగా ఒత్తిడి చేస్తున్న సంగతి తెలిసిందే. ఆయన త్వరలోనే పదవి నుంచి వైదొలగుతారు.