జాత్యహంకారం లేదని ఎవరు చెప్పారు?

ఆస్ట్రేలియాలో జాతివివక్షకు తావులేదని, ఇటీవల వరుసగా భారతీయ విద్యార్థులపై జరుగుతున్న దాడులు జాత్యహంకారపూరితమైనవి కాదని ఆ దేశ ప్రభుత్వం గట్టిగా వాదిస్తున్నప్పటికీ, ఆ దేశ ప్రజలు మాత్రం ఇందుకు భిన్నమైన అభిప్రాయాలు వెలిబుచ్చారు. తమ దేశంలో జాత్యహంకారం ఉందని ఆస్ట్రేలియన్లే స్వయంగా అంగీకరించారు.

బహుళసంస్కృతుల విధానంపై ఆస్ట్రేలియన్లు భిన్నాభిప్రాయాలు కలిగివున్నారు. ఆస్ట్రేలియాలో నిర్వహించిన ఓ సుదీర్ఘ అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. తమ దేశంలో జాత్యహంకారం ఉందని ప్రతి పది మంది ఆస్ట్రేలియన్లలో తొమ్మిది మంది విశ్వసిస్తున్నారు. సాంస్కృతిక భిన్నత్వం దేశానికి మంచిదేనని ఆస్ట్రేలియన్లు భావిస్తున్నప్పటికీ, దీనిని ముందుకు తీసుకెళ్లేందుకు సంస్కృతులపరమైన తేడాలు ప్రతి ఒక్కరికి ప్రతిబంధకాలు అవుతున్నాయి.

ఆస్ట్రేలియాలోని వివిధ విశ్వవిద్యాలయాలు 11 ఏళ్లపాటు జరిపిన అధ్యయనంలో 85 శాతం మంది ఆస్ట్రేలియన్లు తమ దేశంలో జాతిదురహంకారం ఉందని అంగీకరించారు. అంతేకాకుండా ప్రతి ఐదుగురిలో ఒకరు జాతివివక్షతో కూడిన దుర్భాషను ఎదుర్కొన్నవారేనని ఈ సర్వే వెల్లడించింది.

సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్ ఈ సర్వేకు సంబంధించిన వివరాలు బుధవారం బహిర్గతం చేసింది. ఈ సర్వేలో మొత్తం 16 వేల మంది ఆస్ట్రేలియన్ల అభిప్రాయాలు సేకరించారు. వీరిలో 6.5 శాతం మంది బహుళ సంస్కృతుల విధానాలను వ్యతిరేకిస్తున్నారు. ఎక్కువ మంది ఆస్ట్రేలియన్లు దేశంలో భిన్నసంస్కృతులు ఉండటం మంచిదేనని భావిస్తున్నప్పటికీ, దీనిని సరిగా పాటించలేరని అభిప్రాయపడుతున్నారు.

వెబ్దునియా పై చదవండి