తాలిబన్ ఉగ్రవాద సంస్థకు చెందిన అగ్రనాయకులు పాకిస్థాన్‌లోనే ఉన్నారని, అక్కడినుంచే ఆ సంస్థకు చెందిన తీవ్రవాదులను పాకిస్థాన్, ఆఫ్గనిస్థాన్ సరిహద్దుల్లోకి పంపి దాడులకు పాల్పడుతున్నారని అమెరికా తెలిపింది.
ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న తాలిబన్ ఉగ్రవాద సంస్థకు చెందిన అగ్రనాయకులు పాకిస్థాన్‌లోనే ఉన్నారని అమెరికా విదేశాంగ కార్యదర్శి హిల్లరీ క్లింటన్ తెలిపారు.
పాక్ నుంచే వారు తమ సంస్థకు చెందిన తీవ్రవాదులను సరిహద్దుల్లోకి పంపి దాడులు చేయిస్తున్నారని ఆమె అన్నారు. ఇటీవల పాకిస్థాన్‌లోని భారత రాయబార కార్యాలయం, పాక్ భద్రతాదళాధికారి కార్యాలయంపై జరిగిన దాడులకు సంబంధించి ఆమె పై విధంగా స్పందించారు.
తాలిబన్ ప్రధాన నేతలు, అల్‌ఖైదాకు చెందిన అగ్రనాయకులు కూడా పాకిస్థాన్ దేశంలోనే ఉన్నారని, అక్కడి నుంచే వారు తమ కార్యకలాపాలను కొనసాగిస్తూ, తీవ్రవాదులను సరిహద్దుల్లోకి తరలించి దాడులు చేయిస్తున్నారని ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.
ఆఫ్గనిస్థాన్‌లోనే తాలిబన్లు స్థావరాలను ఏర్పరచుకుని ఉన్నరా అని విలేకరులు అడిగిన ప్రశ్నకు ఆమె సమాధానమిస్తూ...తాలిబన్లు తమ స్థావరాలను పాక్, ఆఫ్గనిస్థాన్ దేశాలలో ఏర్పాటు చేసుకుని ఉన్నారని ఆమె అన్నారు.
తాలిబన్లు, అల్‌ఖైదాకు చెందిన ఉగ్రవాదులు అమాయకులైన గిరిజనులను పొట్టనబెట్టుకుంటున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధానంగా వారు అమెరికాకు చెందిన సైన్యం, అలాగే భారతదేశానికి చెందిన వారిని ప్రధానంగా టార్గెట్ చేసుకుని దాడులకు పాల్పడుతున్నారని ఆమె తెలిపారు.