పాకిస్థాన్ దేశంలో వేళ్ళూనుకుని ఉన్న తాలిబన్లను ఎదుర్కొనేందుకు నలువైపులనుంచి ముట్టడించాలని పాక్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ అన్నారు.
పాక్ దేశంలో వేళ్ళూనుకుని ఉన్న అల్‌ఖైదా తీవ్రవాదులను బలవంతంగా అంతమొందించాల్సిన అవసరం ఉందని, దీంతోపాటు తాలిబన్లను ఎదుర్కొనేందుకు వారిని నలువైపులనుంచి పాక్ సైన్యం, రాజకీయంగా, సామాజికపరంగా వారిని ముట్టడించాలని ఆయన శుక్రవారం అర్ధరాత్రి పాక్ ప్రభుత్వానికి సూచించారు.
సివోక్స్ ఫాల్స్‌లోనున్న ఆగస్టానా కాలేజ్‌లో విద్యార్థులనుద్దేశించి ప్రసంగిస్తూ... తాలిబన్లు ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఉన్నారని, దీనికంటూ ఎవ్వరూ కమాండర్, నడిపే అగ్రనాయకుడు ఎవ్వరూ లేరని ఆయన అన్నారు. తాలిబన్లను అంతమొందిస్తే మొత్తం ఉగ్రవాదం పరిసమాప్తమౌతుందని ఆయన తెలిపారు. దీంతో ఉగ్రవాద సమస్య తొలగిపోతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
ఉగ్రవాదంపై యుద్ధం ప్రకటించిన అమెరికాకు ఈ సందర్భంగా ఆయన తన మద్దతు తెలిపారు. ముషారఫ్ పాకిస్థాన్‌లో తన పదవీ త్యాగం చేసిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఎన్నో బౌద్ధిక సంస్థలలో, విశ్వవిద్యాలయాల్లో అనేక ఉపన్యాసాలిచ్చారు.