తీవ్రవాదుల దాడిని తిప్పికొట్టిన పాక్ భద్రతా సిబ్బంది
శుక్రవారం, 16 అక్టోబరు 2009 (09:39 IST)
లాహోర్‌లోని ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎఫ్ఐఏ) కార్యాలయంపై దాడికి తెగబడిన తీవ్రవాదుల ఆగడాలను పాకిస్థాన్ భద్రతా సిబ్బంది సమర్థవంతంగా తిప్పికొట్టింది. ఈ దాడుల్లో 41 మంది ప్రాణాలు కోల్పోయారు. భారీ భద్రత కలిగిన రక్షణ వలయాలను ఛేదించుకుని దాడులకు పాక్‌లో దాడులకు పాల్పడటం గమనార్హం.
ఉగ్రవాదుల దాడుల ఫలితంగా కళకళలాడే లాహోర్ కళావిహీనమై పోయింది. పేలుళ్లతో కొహట్ ప్రాంతం దద్దరిల్లి పోయింది. ఈ ఘటనల్లో 41 మంది మృత్యువాత పడ్డారు. తీవ్రవాదులు దాడులకు తెగబడిన నాలుగు ప్రాంతాల్లో మూడు భద్రతా పరిధిలోనివే కావడం గమనార్హం. ఎఫ్‌ఐఏ కార్యాలయం ఉన్న భవనం, పోలీసు శిక్షణ కేంద్రాలపై ఉగ్రవాదులు విరుచుకుపడ్డారు.
ఇదిలావుండగా, దాడులకు పాల్పడింది తామేనని తెహ్రిక్ ఏ తాలిబాన్ అనే సంస్థ ప్రకటించిందని జియో టీవీ ప్రకటించింది. మొత్తం మీద పాక్ భద్రతా సిబ్బంది ఈ దాడిని సమర్థవంతంగా తిప్పికొట్టడంతో పాక్ ప్రజలతో పాటు.. పాలకులు ఊపిరి పీల్చుకున్నారు.