త్వరలో ఫ్రాన్స్‌కి తిరిగిరానున్న ఐఎంఎఫ్ మాజీ ఛీఫ్ స్ట్రాస్‌కాన్
బుధవారం, 31 ఆగస్టు 2011 (10:30 IST)
లైంగిక ఆరోపణల కేసు నుంచి విముక్తి లభించడంతో అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) మాజీ మేనేజింగ్ డైరక్టర్ డొమినిక్ స్ట్రాస్‌కాన్ త్వరలో అమెరికాను వీడి ఫ్రాన్స్ తిరిగివచ్చే అవకాశం ఉందని ఆ దేశ సోషలిస్ట్ పార్టీ నాయకుడు మార్టిన్ అబ్రీ మంగళవారం వెల్లడించారు. స్ట్రాస్‌కాన్ ఫ్రాన్స్ అధ్యక్ష పదవి రేసులో ఉన్నారు.
"ఆయన కొద్ది రోజుల్లో తిరిగివస్తారు" అని రానున్న ఫ్రాన్స్ అధ్యక్ష ఎన్నికలకు సోషలిస్ట్ పార్టీ అభ్యర్ధుల్లో ఒకరైన అబ్రీ పేర్కొన్నారు. నెలల పాటు గృహ నిర్భందంలో ఉండి మంగళవారం వాషింగ్టన్‌లోని ఐఎంఎఫ్ ప్రధాన కార్యాలయంలో ఘనంగా వీడ్కోలు అందుకొన్న స్ట్రాస్‌కాన్ మాన్‌హట్టన్ కోర్టు ప్రధాన ప్రాసిక్యూటర్ తనపై నమోదైన లైంగిక ఆరోపణలను వెనక్కుతీసుకొన్న తర్వాత స్వదేశానికి రానున్నారు.
న్యూయార్క్‌లోని హోటల్ పనిమనిషిపై లైంగిక దాడికి పాల్పడినట్లు ఆరోపణలతో మే నెలలో అరెస్ట్ అయిన ఈ మాజీ ఐఎంఎఫ్ ఎండీ రాజకీయాల్లోకి తిరిగి రావడాన్ని అనేకమంది ఫ్రాన్స్ ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. కొన్ని రాజకీయ పక్షాలు స్ట్రాస్‌కాన్‌కు మద్దతు తెలుపుతుండగా మరికొన్ని ఆయన తన రాజకీయ జీవితాన్ని తిరిగి ప్రారంభించడంపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి.