దాడులతో అతలాకుతలమౌతున్న పాక్: 41మంది మృతి

పాకిస్థాన్ దేశంలో తాలిబన్ ఉగ్రవాదుల దాడులు రోజురోజుకు మితిమీరి పోతున్నాయి. తాజాగా గురువారం జరిగిన దాడుల్లో దాదాపు 41మంది మృతి చెందారు.

లాహోర్‌లోని భద్రతా బలగాలకు చెందిన మూడు ప్రాంతాలలో తాలిబన్ ఉగ్రవాదులు ఒకేసారి దాడులకు పాల్పడ్డారు. పాక్ వాయువ్య ప్రాంతమైన కోహాట్ పట్టణంలో ఓ పోలీసు స్టేషన్‌లో ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ దాడుల్లో మొత్తం 41 మంది మృతి చెందారు.

లాహోర్‌లోని ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ( ఎఫ్ఐఏ ) మరియు లాహోర్‌లోని రెండు పోలీసు శిక్షణా కేంద్రాలపై ఉగ్రవాదులు మూడు గ్రూపులుగామారి ఒకే సమయంలో దాడులకు పాల్పడ్డారని పోలీసు వర్గాలు వెల్లడించాయి.

స్థానిక సమయానుసారం గురువారం ఉదయం పది గంటల నలభై నిమిషాలకు ఉగ్రవాదులు దాడదులకు పాల్పడ్డారు. ఈ దాడుల్లో దాదాపు ఇరవై మంది మృతి చెందారని, వీరిలో భద్రతాదళాలకు చెందిన వారు 16 మంది కాగా మరో నలుగురు స్థానిక పౌరులున్నట్లు పోలీసులు తెలిపారు.

ఉగ్రవాదులు జరిపిన దాడుల్లో ఇరవై మంది మృతి చెందగా భద్రతా దళాలు 10 మంది తీవ్రవాదులను మట్టుబెట్టారు. వీరిలో మరి కొందరు తమను తాము పేల్చేసుకున్నారు. గురువారం జరిగిన దాడుల్లో దాదాపు నలభై మందికి పైగా తీవ్ర గాయాల పాలైనట్లు అధికారులు వివరించారు.

కోహాట్‌లో ఆత్మాహుతి దళానికి చెందిన ఓ వ్యక్తి బాంబులతో కూడిన ఓ వాహనాన్ని తీసుకుని పోలీసు స్టేషన్‌పై దూసుకు పోయాడు. దీంతో అక్కడికక్కడే 11 మంది మృతి చెందారు. ప్రత్యక్ష సాక్షుల కథనం మేరకు పోలీసు స్టేషన్ బయటి గోడకు ఆ వాహనం ఢీకొనడంతో భయంకరమైన పేలుళ్ళు జరిగాయని వారు తెలిపారు.

వెబ్దునియా పై చదవండి